హలో పోలీసూ.. ఏంటా పని..!!
నాగ్‌పూర్ : రిపబ్లిక్ డే సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినిలపై డబ్బులు వెదజల్లిన ఓ పోలీసు హెడ్‌కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. వివరాలు.. నాగ్‌పూర్‌లోని భివాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ప్రమోద్ వాల్కే హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ‘ఆయే వతన్ తేరే లియే’ దేశభక్తి గీతాన్ని ప్రదర్శిస్తున్న స్కూల్ విద్యార్థినిలపై తప్పతాగిన వాల్కే డబ్బులు వెదజల్లాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. సదరు పోలీసు చర్యపై విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. విధుల్లో ఉండి మద్యం సేవిచండంతో పాటు.. ఒళ్లు మరచి ప్రవర్తించినందుకు సస్పెండ్ చేశారు. కాగా, ముంబైలో డాన్సింగ్ బార్ల నిర్వహణకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే, డ్యాన్సర్లపై డబ్బులు వెదజల్లడం నిషేధించిన కోర్టు.. కావాలంటే వారికి టిప్ అందివ్వొచ్చని పేర్కొంది. సీసీ కెమెరాల నిఘాలో డ్యాన్స్ బార్లు నిర్వహించుకోవాలని నిబంధనలు విధించింది.