ట్రాఫిక్ పోలీసుల్లో ‘డి’ విటమిన్ లోపం!
హీల్ ఫౌండేషన్ సర్వేలో వెల్లడి
బెంగళూరు : నగరంలోని ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల్లో డి-విటమిన్ కొరత విపరీతంగా ఉందన్న విషయం వెల్లడైంది. ప్రముఖ ఆరోగ్య సంస్థ హీల్ ఫౌండేషన్, గ్లేన్‌మార్క్ నేతృత్వంలో నిర్వహించిన వైద్య పరీక్షా శిబిరంలో ఈ ఆందోళనకర అంశం బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను హీల్ ఫౌండేషన్ సంస్థ శుక్రవారమిక్కడ ఓ ప్రటకన లో తెలిపింది. శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు విటమిన్-డి కి సంబంధించిన వైద్య పరీక్షలను నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది.
ఈ పరీక్షల్లో మొత్తం 240 మంది శాంపిల్స్‌కు గాను కేవలం ముగ్గురు వ్యక్తుల్లోనే విటమిన్-డి మోతాదు సరిగ్గా ఉండగా, 50 మందిలో కాస్తంత తక్కువగా, 187 మందిలో అత్యంత తక్కువగా విటమిన్-డి ఉందన్న విషయం నమోదైందని వెల్లడించింది. విటమిన్-డి కొరత కారణంగా స్థూలకాయంతో పాటు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు సైతం తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువగా సన్‌స్క్రీన్ లోషన్లు వాడడం, శరీరానికి ఎండ తగలకుండా ఉండడం వల్ల విటమిన్-డి కొరత తలెత్తుతోందని పేర్కొంది. అందువల్ల ప్రతి ఒక్కరు శరీరంలో విటమిన్-డి లభ్యతకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తన ప్రకటనలో సూచించింది.