'వైద్యశాఖ పోస్టులు త్వరలో భర్తీ'
-వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు
రాజాం: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సుమారు 350 వైద్య పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాం జీఎంఆర్ కేర్ ఆస్పత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్యులకు పోస్టుల భర్తీలో వెయిటేజ్ కల్పిస్తామన్నారు. ఎన్ఆర్హెచ్ఎం(నేషనల్ రూరల్ హెల్త్ మిషన్) ఉద్యోగులను పర్మినెంట్ చేస్తారా అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టామని, త్వరలో న్యాయం చేస్తామని కామినేని తెలిపారు.
ఏరియా ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పనకు నిధుల సమస్య వెంటాడుతోందన్నారు. రాజాంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జునరావు దరఖాస్తు చేసుకున్నారని, దీనిపై పరిశీలన కోసం వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతంలో జీఎంఆర్ కేర్ ఆస్పత్రి నెలక్పొడం గర్వకారణమని, అయితే ఈ ఆస్పత్రిలో 135 పడకలు ఉన్నాయని, 300 పడకలకు పెంచితే దరఖాస్తు పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలో ఇంతవరకూ స్వైన్‌ఫ్లూతో ఐదుగురు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని చెప్పారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు త్వరలో మంజూరు చేస్తామన్నారు. ఆయన వెంట కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ దామెర రాజేంద్ర తదితరులు ఈ పరిశీలన ప్రక్రియలో భాగంగా మంత్రి కామినేని శ్రీనివాసరావుతో పాటు వచ్చారు.