ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకూ ఆరోగ్య బీమా!
50శాతం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది
న్యూఢిల్లీ: పట్టణ ప్రాంతాల్లోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకూ ఆరోగ్య బీమా సదుపాయాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వీరు చెల్లించాల్సిన ప్రీమియంలో 50 శాతాన్ని తానే చెల్లించనుంది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల వారికి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్ఎస్బీవై) పథకం కింద స్మార్ట్కార్డ్ ఆధారిత నగదు రహిత ఆరోగ్య బీమా సదుపాయాన్ని కేంద్రప్రభుత్వం 2007, అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడీ పథకం కింద అసంఘటిత రంగంలోని ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా, హైవేల శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ గురువారం తెలిపారు. ఈ పథకం కింద ఆటో రిక్షా డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు ప్రీమియంలో 50 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇదిగాక రిజిస్ట్రేషన్ ఫీజు కింద అదనంగా మరో రూ.30 చెల్లించాలి. మిగతా 50 శాతం ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 25 శాతం చొప్పున భరిస్తాయి. ఈ పథకం కిందకు వచ్చే ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లను గుర్తించి.. డేటాను రూపొందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.