మృత్యువుతో పోరాడి ఓడిన శిశువు
ఛాతీ వెలుపల గుండెతో పుట్టిన వైనం
ఫలించని వైద్యుల ప్రయత్నం
హైదరాబాద్: ఇటీవల ఛాతీ వెలుపల గుండెతో పుట్టిన అరుదైన శిశువు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. 36 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. పసికందును బతికించేందుకు కేర్ ఆస్పత్రి వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. చంపాపేట్ డివిజన్ సామ నర్సింహారెడ్డి కాలనీకి చెందిన ఓ మహిళ గతనెల 6న కర్మన్‌ఘాట్ కృష్ణసాయి ఆస్పత్రిలో కవలలకు జన్మనిచ్చింది. వీరిలో రెండో శిశువుకు ఛాతీ లోపల ఉండాల్సిన గుండె.. ఛాతీ వెలుపల గుండె వేలాడుతోంది. దీంతో శిశువును నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కార్డియాలజిస్టులు లేకపోవడంతో నిమ్స్‌కు తరలించారు. ఈ అరుదైన శిశువుకు చికిత్స చేసేందుకు కేర్ వైద్యుల బృందం ముందుకొచ్చింది.
పుట్టిన నాలుగు రోజుల తర్వాత శిశువును కేర్ ఆస్పత్రికి తరలించారు. సర్జన్ డాక్టర్ తపన్ ద్యాస్, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలోని వైద్యబృందం గతనెల 9న శస్త్రచికిత్స చేసి ఛాతీ వెలుపల ఉన్న గుండెను లోపల అమర్చింది. అప్పటికే ఇన్ఫెక్షన్ సోకడంతో శిశువు ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. గుండె పనితీరు మెరుగు పడినా, ఇన్ఫెక్షన్ వల్ల మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరు దెబ్బతింది. దీంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ శిశువు కేర్ ఆస్పత్రిలోనే కన్నుమూసింది.