భార్య, కుమారుడికి నిప్పంటించి.. భర్త ఆత్మహత్యాయత్నం
తాగిన మైకంలో ఘాతుకం చికిత్స పొందుతూ మృతి
తాగిన మత్తులో ఓ వ్యక్తి.. కట్టుకున్న భార్య, కన్నకొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం అతడూ ఆత్మహత్యకు యత్నించాడు. ముగ్గురూ మృతిచెందారు. మహారాష్ర్ట నాందేడ్ జిల్లా ముద్కేడ్ మండలం రాజదప్క గ్రామానికి చెందిన శరత్(30), పద్మావతి (25) దంపతులకు రెండేళ్ల కుమారుడు జయంత్ ఉన్నాడు. వీరు రెండు నెలల క్రితం నగరానికి వచ్చి మియాపూర్‌లోని సాయినగర్ కాలనీలో ఉంటున్నారు.
పెయింటర్‌గా పనిచేస్తున్న శరత్.. ఈనెల 14న మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో పద్మ.. భర్తను మందలించింది. అనంతరం నిద్రపోయిన భార్య, కుమారుడిపై శరత్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తన ఒంటిపై కూడా కిరోసిన్ పోసుకుని అంటించుకున్నాడు. వారి కేకలు విన్న స్థానికులు వెంటనే వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన బాధితుల్ని 108 అంబులెన్స్ ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రీకొడుకులు ఆదివారం రాత్రి మృతిచెందగా, సోమవారం పద్మ ప్రాణాలు కోల్పోయింది.