గుండెగది
కవిత
గుండెగది చాలా చిన్నది
అగాధాల వేదనని దాచుకుంటుంది
కొండంత ప్రేమనీ ఇముడ్చుకుంటుంది
గుండెగది చాలా చిన్నది
వేనవేల భావాల్ని పలికిస్తుంది
అంతలోనే మౌనంగా మూగబోతుంది
రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగురుతుంది
క్షణంలోనే నిశ్శబ్దాల పొరల్లో
దాగుడుమూతలాడుతుంది
గుండెగది చాలా చిన్నది
అందని ఆకాశపుటంచుల కోసం ఆరాటపడుతుంది
ఇసుకదారుల్లో ఎండమావుల వెంట
పరుగులు పెడుతుంది
నడి సంద్రంలో చుక్కాని కోసం వెదుకుతుంది
హోరుధ్వనిలో మౌనాన్ని వెతుక్కుంటుంది
అంతలోనేఅలా ఒక మూల దాక్కొని
వెక్కిళ్ల వరద అవుతుంది
గుండెగది చాలా చిన్నది
అడుగుల సవ్వడి ఆగిపోగానే
గడ్డకట్టిపోతుంది
నలుగురు అవసరం లేకుండానే
వెళ్లాల్సిన దారి తెలిసిపోతుంది
గుండెగది ఖాళీ అవుతుంది
ఆ తర్వాత అంతా మౌనమే.
- ఎస్.గోపీనాథ్‌రెడ్డి
9505555400