ఇదేం అద్దె బాబోయ్ !
- పెనుకొండలో భారీగా పెరుగుతున్న ఇంటి అద్దెలు
- ‘కియో’ ఎఫెక్టేనంటున్న అధికారులు
- తీవ్ర ఇబ్బందుల్లో సామాన్యులు
పెనుకొండ : పెనుకొండలో పెరిగిన ఇంటి అద్దెలతో సామాన్యుడు కుదేలవుతున్నారు. క్రింది స్థాయి ఉద్యోగులు సైతం తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. చేసేది లేక కొంత మంది ఏకంగా పుట్టపర్తి, కొత్తచెరువు, సోమందేపల్లి లాంటి సమీప మండల కేంద్రాలకు తమ మకాం మార్చుతున్నారు. చిన్న ఉద్యోగులు తమకు వచ్చే జీతంతో అంత బాడుగలు చెల్లించుకోలేమని మదన పడుతూ ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి.
కియా ఎఫెక్ట్‌తోనే..
మండలంలోని అమ్మవారుపల్లి, ఎర్రమంచి ప్రాంతాల్లో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధం కావడం, కొరియా దేశం నుంచి కియా ప్రతినిధులు ఇక్కడికి భారీగా రావడంతో పాటు ఎల్అండ్టీ కాంట్రాక్ట్ సంస్థకు భారీగా కార్మికులు, ఉద్యోగులు తరలిరావడంతో పట్టణంలో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇల్లు చూడచక్కగా ఉంటేనే అద్దె తగిన విధంగా ఇవ్వడానికి బయట ప్రాంతాల వ్యక్తులు సిద్ధమవుతున్నారు. అనేక మంది ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తులు కొత్త ఇళ్ళను నిర్మించుకునేందుకు సన్నాహాలు ముమ్మరం చేయగా మరి కొందరు లక్షలు వెచ్చించి ఇళ్లను అందగా ముస్తాబు చేయిస్తున్నారు. అలాగే పట్టణంలో భారీ అపార్ట్మెంట్లు నిర్మాణమవుతున్నాయి. నిర్మాణంలో ఉన్న ఇళ్ళకే బయట ప్రాంతాల నుంచి వస్తున్న అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. దీంతో పాటు గుట్టూరు, పాలసముద్రం సమీపంలోని గ్రేట్‌వే విల్లాస్‌లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ రానున్న 2 నెలల తరువాత మరింత పుంజుకోనుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా పెంచడం తగదు
- రామమూర్తి, ఆర్డీఓ
పట్టణంలో ఇష్టారాజ్యంగా ఇంటి బాడుగలు పెంచడం తగదు. సామాన్యుడు, మధ్యతరగతి ఉద్యోగులు ఇక్కడ ఉండలేని పరిస్థితి వస్తోంది. ఇప్పటికే కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చాయి. కియా కార్ల పరిశ్రమ నిర్మాణ ప్రారంభంతోనే బాడుగలు పెరిగాయి.
ప్రచారం ఎక్కువగా ఉంది
- సుదర్శనరెడ్డి, న్యాయవాది, పెనుకొండ
కియా ప్రతినిధులు కాని ఎల్అండ్టీ ఉద్యోగులు కాని ఇతర కార్మికులు కాని తమకు కావాల్సిన ఇళ్ళను ఎంపిక చేసుకుంటూ బాడుగలు పెంచారు. అయితే పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు అలాంటి ప్రభావం లేదు. బాడుగలు పెరిగాయన్న ప్రచారం ఎక్కువగా ఉంది. అయితే కియా టౌన్ షిప్ నిర్మిస్తే దీని ప్రభావం తగ్గుతుంది.