భద్రత డొల్ల
- బ్యాంకులో చోరీపై దర్యాప్తు ముమ్మరం
- నేరస్తులకోసం ఐదు బృందాల వేట
- గతంలో జరిగిన ఘటనలపై ఆరా
- పాత నేరస్తుల కదలికలపై నిఘా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : బాలానగర్ గ్రామీణ వికాస్ బ్యాంకులో సోమవారం వెలుగుచూసిన భారీ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటన జరిగిన తీరును సమీక్షించిన పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బ్యాంకులో భద్రతా లోపాల వల్లే పెద్ద మొత్తం చోరీకి గురైందని అంచనాకు వచ్చారు. పొరుగు జిల్లాల్లో గతంలో జరిగిన బ్యాంకు దోపిడీ ఘటనల వివరాలు సేకరించారు. 2013లో మెదక్ జిల్లా కవేలీలోని ఓ బ్యాంకు కొల్లగొట్టే ప్రయత్నంలో దొంగలు ఎస్ఐపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ యేడాది ఫిబ్రవరిలో జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లోనూ భారీ దోపిడీ జరిగింది.
ఈ ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే పోలీసులు హైదరాబాద్‌లో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ నిందితుడిని అరెస్టు చేశారు. అతనివద్ద నుంచి ఏడుకిలోల బంగారం, రూ.13.42లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ గ్రామీణ వికాస్ బ్యాంకు చోరీ ఘటన నేపథ్యంలో ఈ రెండు ఘటనలు జరిగిన తీరుపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో అరెస్టయిన నిందితులు జైల్లో ఉన్నారా, బెయిల్‌పై బయటకు వెళ్లారా, వారి కదలికలు ఎక్కడున్నాయి అనే కోణంలో షాద్‌నగర్ డీఎస్పీ ద్రోణాచార్యులు, సీఐ గంగాధర్ పర్యవేక్షణలో బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జహీరాబాద్, స్టేట్ క్రైం రికార్డ్సు బ్యూరోతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక పోలీసు బృందాలు బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.
భద్రతా లోపాల వల్లే!
బ్యాంకులో భద్రతా లోపాల వల్లే భారీ మొత్తంలో బంగారం, నగదు చోరీకి గురైందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. స్ట్రాంగు రూం, సెక్యూరిటీ ఏర్పాట్లు, సీసీ కెమెరాల ఫుటేజీ భద్ర పరిచే సిస్టమ్‌కు రక్షణ లేకపోవడం వంటి కారణాల వల్లే నేరస్తులు సులువుగా పెద్ద మొత్తాన్ని చేజిక్కించుకున్నట్లు ఘటన క్రమం వెల్లడిస్తోంది. బ్యాంకుల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని రెండు నెలల క్రితమే నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో 31 బ్యాంకులకు చెందిన 349 బ్రాంచీల్లో కొన్నిచోట్ల మాత్రమే సెక్యూరిటీ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. బాలానగర్ మండల కేంద్రంలో ఎస్బీహెచ్, ఏపీజీవీవీ శాఖలున్నా సెక్యూరిటీ ఏర్పాట్లు లేవు.
గతంలో బాలానగర్ ఎస్బీహెచ్ ఏటీఎంలో చోరీ యత్నం జరిగినా సీసీ కెమెరా లేకపోవడంతో నిందితుడిని గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో వేలిముద్రలు లేకపోవడం, సీసీ ఫుటేజీ చోరీకి గురి కావడంతో దర్యాప్తు క్లిష్టతరంగా మారింది. నేరస్తులు వదిలి వెళ్లిన గ్యాస్ సిలిండర్, ఇతర పరికరాలు ఎక్కడ నుంచి తెచ్చారనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. షాద్‌నగర్ రూరల్ సీఐ గంగాధర్‌తో కలిసి డీఎస్పీ ద్రోణాచార్యులు మంగళవారం మరోమారు ఘటన స్థలాన్ని సందర్శించి మరిన్ని వివరాలు సేకరించారు. కొంత ఆలస్యమైనా చోరీ కేసును ఛేదిస్తామనే ధీమా పోలీసువర్గాల్లో కనిపిస్తోంది.