జనసంద్రంగా మారిన ఇంద్రకీలాద్రి
సాక్షి, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. మాల విరమణకు చివరిరోజు కావడంతో దుర్గమ్మ కొండపై భక్తుల రద్దీ పెరిగింది. భవానీ దీక్షల విరమణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు విజయవాడకు చేరుకుంటున్నారు. బుధవారం రాత్రి నుంచే స్నాన ఘాట్లు, క్యూలైన్లు, గిరి ప్రదక్షణ ప్రాంతం భవానీ భక్తులతో కిక్కిరిసి ఉన్నాయి. భవానీల సంఖ్య అనూహ్యంగా పెరడగంతో గురువారం తెల్లవారుజామున ఒకటిన్నరకే ఆలయం తెరిచారు. ఎక్కువసేపు క్యూలైన్లలో వేచిచూసే ఇబ్బంది తొలగేలా త్వరగా దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానంతరం మహామండపం వద్ద ఏర్పాటుచేసిన హోమగుండాల్లో నేతి కొబ్బరికాయలు వేసి భవానీలు మొక్కులు తీర్చుకుంటున్నారు. గురుభవానీల సమక్షంలో దీక్ష విరమిస్తున్నారు. ఈరోజు జరిగే పూర్ణాహుతితో భవానీ దీక్షలు లాంఛనంగా పరిసమాప్తి అవుతాయి.
అధికారుల నిబంధనలతో భక్తుల ఇక్కట్లు
అయితే ఇంద్రకీలాద్రిపై అధికారులు పెట్టిన నిబంధనలతో భవానీ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వాహనాలకు పోలీసులు పార్కింగ్ ప్రదేశాన్ని చూపలేదు. లడ్డూ ప్రసాదాలను ఇచ్చే కౌంటర్లు మూడే ఉండడంతో ప్రసాదాల కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉంటున్నారు.