Helen Keller
-
వండర్ ఉమెన్
-
వండర్ ఉమెన్
-
ఆత్మస్థైర్యం ఆయుధం కావాలి
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఇందుకోసం అవసరమైన సహాయాన్ని, సహాకారాన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర స్త్రీ,శిశు, వయోవృద్ధుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా స్థానిక గిరిజనభవన్లో గురువారం విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలను మంత్రి అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగుల పట్ల దయ చూపించాలని జాలి చూపిస్తే వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించి వారిలో ప్రతిభను వెలికి తీసి వారి భవిష్యత్ బాగుండేందుకు సమాజంలో ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు మానసిక ఆందోళనకు గురికాకూడదని పట్టుదల, కృషితో సకలాంగులతో సమానంగా అభివృద్ధి చెందేలా ఉండాలని కోరారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన విషయాలు తన దృష్టికి తీసుకురావాలని, కమ్యూనిటీ హాలు ఇతర మౌలిక వసతులు కలుగచేసే విషయంలో తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలి విభిన్న ప్రతిభావంతుల జేఏసీ చైర్మన్ అల్లాడి నటరాజు మాట్లాడుతూ వికలాంగుల హక్కుల రక్షణ చట్టం–2016ను అమలుచేయాలని, గ్రామ వలంటీర్ల నియామకంలో వికలాంగులకు అవకాశం ఇవ్వడంతో పాటు విద్యార్హత, వయోపరిమితుల్లో సడలింపు ఇవ్వాలని కోరారు. జిల్లాలో రెండో విడత మూడు చక్రాల మోటారు సైకిళ్లను త్వరితగతిన అందజేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్, వైసీపీ నాయకులు బండారు కిరణ్కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కొంతమంది కోసమే పనిచేసిందని, ప్రస్తుతం అందరి ప్రభుత్వం వచ్చిందని సమస్య ఏదైనా, ఎవరిదైనా దాని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈసందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏలూరులో విభిన్న ప్రతిభావంతుల కోసం కమ్యూనిటీ హాలును నిర్మించాలని, అంధ నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం ఒకేషనల్ ట్రైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించాలని, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. సదరం సర్టిఫికెట్ల జారీ చేసేటప్పుడు, మార్పులు, చేర్పులూ చేసే సమయంలో ఎక్కువ రోజులు పడుతోందని త్వరితగతిన సదరం సర్టిఫికెట్లు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. అనంతరం ఎన్జీఓలు, వివిధ సంఘాల నాయకులు మంత్రి తానేటి వనితను సన్మానించారు. విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులు వీరభద్రరావు, ఉమ్మా వెంకటేశ్వరరావు, రఫీ, ఎస్ వాసు, ఆర్ రాము, వి.శ్రీను, మనోజ్ కుమార్, దుర్గయ్య, సునీత, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. 138 మందికి కృత్రిమ అవయవాలు జిల్లాలోని 138 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.7.40 లక్షల విలువైన కృత్రిమ అవయవాలను మంత్రి తానేటి వనిత అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు వి.ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ఆర్థిక సంవత్సరం 2 వేల మందికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మేలు చేశామన్నారు. దాదాపు వెయ్యి మందికిపైగా కృత్రిమ అవయవాలను పంపిణీ చేసినట్టు తెలిపారు. -
కురాయ్ ఒన్రుమ్ ఇల్లై గోవిందా...
హెలన్ కెల్లర్ పాశ్చాత్య దేశానికి చెందిన వ్యక్తి. పుట్టినప్పుడు భగవంతుడు ఆమెకు అన్నీ ఇచ్చాడు. అసలు లేకపోతే వేరు. కొన్నాళ్ళు ఉండిపోతే ఆ బాధ వేరుగా ఉంటుంది. క్రమంగా ఆమెకు చూపు పోయింది. కొన్నాళ్ళకు వినికిడి శక్తి పోయింది. మరి కొన్నాళ్లకు మాట్లాడగలిగిన శక్తికూడా పోయింది. ఏదో కొద్దిగా మాట్లాడేవారు. అంత బాగా అర్థమయ్యేది కాదు. కానీ ఆవిడ గొప్పతనం ఏమిటంటే–ఎదురుగా ఉన్నది ఏదయినా సరే, ఇలా ముట్టుకుని స్పర్శజ్ఞానంతో చెప్పగలిగేవారు. చిరునవ్వు ఎప్పడూ ఆమె ముఖం మీదనించి చెరిగిపోలేదు. ఆమె స్నేహితురాలు ఒకరు ఓ రోజు ఉదయం వ్యాహ్యాళికి వెళ్ళి వచ్చారు. అలా ప్రకృతిలోకి వెళ్ళివచ్చావు కదా, ఇంతసేపు ఏ అందాలు చూసి వచ్చావు... అని కెల్లర్ అడిగారు. ‘‘ఆ... చూడ్డానికేముంది, రోజూ ఉండేదేగా. కాసేపు అలా నడచి వచ్చా.’’ అని స్నేహితురాలు చెప్పింది. వెంటనే కెల్లర్..‘‘నాకు ఒక్క పువ్వుతొడిమ ముట్టుకుంటే.. ఆ తొడిమను అంత సున్నితంగా చేసిన వాడెవరు? దానిమీద ఆ పువ్వు పెట్టిన వాడెవరు? ఆ బరువుకి తొడిమ వంగిపోకుండా నిలబెట్టినవాడెవరు? అందులోంచి సువాసన వచ్చేట్టు చేసినవాడెవరు?...’’ అని కళ్ళులేని దాన్ని పువ్వు ముట్టుకుంటేనే ఆనందంతో చిరునవ్వు వస్తుందే... కన్నులు, చెవులు, నోరున్నదానివి, ప్రకృతి అందాలు అంతా చూసి చూడ్డానికి ఏముందంటావేం? అంది. అదీ హృదయంలో ఐశ్వర్యం ఉండటం అంటే. ఆవిడ ఒకసారి ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారి కచేరికి వచ్చారు. ఆమె పాడుతుంటే వినడానికి కెల్లర్కు అవకాశం లేదు. కానీ సుబ్బులక్ష్మిగారి కంఠంమీద వేలుపెట్టి, ఆ ధ్వని ప్రకంపనలతో గుర్తించేవారు.. ఆమె ఏం పాడుతున్నారో. సుబ్బులక్ష్మిగారి ఆరోజు పాడుతూ.‘కురాయ్ ఒన్రుమ్ ఇల్లై గోవిందా...’ అని ఓ కీర్తన ఆలపిస్తున్నారు. కురాయ్ అంటే.. నాకు ఏ విధమైన ఫిర్యాదు... ఒన్రుమ్... ఒక్కటి కూడా ఇల్లై.. లేదు అని. ‘‘నువ్వు నాకు ఫలానా విషయంలో కష్టాన్నిచ్చావు. దానివల్ల నేను బాధపడ్డాను..అని చెప్పడానికి గోవిందా... నాకు ఏ ఫిర్యాదూ మిగల్చకుండా చేసావు... నాకు సమస్యలు ఇవ్వలేదు, కష్టాలు ఇవ్వలేదు... నాకు నీపై ఫిర్యాదు చేయడానికి... ఇల్లై గోవిందా... ఏమీ లేకుండా చేసావు గోవిందా...’’ అని ఆమె ఆర్తితో పాడుతున్నారు. నిజానికి సుబ్బులక్ష్మిగారు పడినన్ని కష్టాలు మరొకరు పడి ఉండరు. అన్ని కష్టాలకు ఓర్చుకుని ఆ స్థాయికి వెళ్ళారామె. అటువంటి తల్లి త్రికరణశుద్ధిగా ‘నాకు ఫలానాది ఇవ్వలేదని నా దైవానికి ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు’ అని పాడుతుంటే... ఆమె కళ్ళవెంట కన్నీరు ధారలు కడుతున్నది. అక్కడే ఉన్న కెల్లర్ ఎలాగూ వినలేదు కాబట్టి ఆవిడ కంఠంమీద వేలుపెట్టి... కీర్తన ముగియగానే వేలు తీసేసి వలవలా ఏడ్చేసారు. సుబ్బులక్ష్మిగారు సంజ్ఞల ద్వారా అడిగారు... ఎందుకు ఏడుస్తున్నారని. దానికి కెల్లర్.. ‘‘నాకు కూడా ఇదే. భగవంతుడు నాకు ఏ సమస్యా ఇవ్వలేదు. నిజానికి నాకు వరాలిచ్చాడు. కళ్ళు, చెవులు, నోరు లేవు... అందువల్ల నేను జీవితంలో చాలా శ్రమపడి వృద్ధిలోకి వచ్చాను. అన్నీ ఇచ్చి ఉంటే...ఇంత శ్రమపడేదాన్ని కానేమో... విచ్చలవిడిగా వాడుకుని ఎందుకూ కొరగాకుండా ఉండిపోదునేమో... ఎన్ని జన్మలెత్తినా ఓ భగవంతుడా... నన్ను అనుగ్రహించి నాకున్న ఈ లోపాలు అలాగే ఉంచు. అప్పుడు నేను ఇలాగే ఉంటాను’’ అని సంకేతాలతో తెలియచేసారు. జీవితంలో మనల్ని సమస్యలు చుట్టుముట్టినప్పడు వాటిని విజయవంతంగా ఎదుర్కొని మనల్ని మనం నిగ్రహించుకోవడానికి, మన జీవితానికి ఓ అర్థం, పరమార్థం పొందడానికి ఇటువంటి వారి అనుభవాలు మనకు దిశానిర్దేశం చేస్తాయి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అసలు వైకల్యం ఎవరిది?!
అంతర్దృష్టి లేకపోవడం అంధత్వం కంటే అధమమైనదని విఖ్యాత రచయిత్రి హెలెన్ కెల్లర్ అంటారు. మన పాలకులకు అలాంటి లోచూపు లోపించింది కనుకనే వికలాంగులకు ప్రభుత్వోద్యోగాల్లో 3శాతం రిజర్వేషన్లు కల్పించే పద్దెనిమిదేళ్ల నాటి చట్టాన్ని ప్రభుత్వాలన్నీ అమలు చేసి తీరాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. ఉద్యోగాల్లో ఇచ్చే కోటా 50 శాతం మించరాదని గతంలో సుప్రీంకోర్టే ఆదేశించింది గనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అమలుచేయడం సాధ్యంకాదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను న్యాయమూర్తులు తోసిపుచ్చారు. అలాగే, గుర్తించిన కొన్ని పోస్టుల్ని మాత్రమే వికలాంగులకు కేటాయించాలని 2005లో కేంద్ర ప్రభుత్వం ఒక మెమో ద్వారా చేసిన సూచనను కూడా న్యాయమూర్తులు తిరస్కరించారు. గ్రూప్ ఏ, గ్రూప్ బీ పోస్టులకు కూడా వికలాంగ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని వారు తెలిపారు. ఖాళీ అయిన మొత్తం పోస్టుల సంఖ్యలో 3 శాతం వికలాంగులకు కేటాయించాలితప్ప, ఎంపికచేసిన కొన్నింటిని మాత్రమే వారికి ఇస్తామనడం న్యాయబద్ధం కాదని స్పష్టంచేశారు. సాంకేతిక అభివృద్ధి పర్యవసానంగా వైకల్యం ఉన్నవారు సైతం ఇతరులతో సమానంగా అన్ని పనులనూ చేయగలిగే పరిస్థితులు వచ్చాయని... ఇలాంటి పరిస్థితుల్లో వారికి పరిమితులు విధించాలని చూడటం సరైన విధానం కాబోదని వారన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కారణంగా కంటిచూపు కరువైనవారికి లేదా పాక్షికంగా చూపుదెబ్బతిన్నవారికి... వినికిడిలోపం ఉన్నవారికి... సెరిబ్రల్ పాల్సీ వ్యాధిగ్రస్తులకు ఇకపై ఒక్కోశాతం చొప్పున ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ... ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ అలాంటివారికి ఇకపై ఉద్యోగావకాశాల్లో కోటా ఉంటుంది. దేశ జనాభాలో వివిధ రకాల వైకల్యంతో బాధపడుతున్నవారి సంఖ్య 2.1 శాతం ఉంటుందని 2001 జనాభా లెక్కలు చెబుతున్నాయి. 2011 జనాభా గణాంకాల్లో వికలాంగులకు సంబంధించిన వివరాలు ఇప్పటికింకా లభ్యంకాలేదు గానీ వారి శాతం జనాభాలో 5నుంచి 6 శాతం ఉండొచ్చని ఒక అంచనా. మన ప్రణాళికా సంఘం, ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగాల లెక్క ప్రకారం ఇది 10 శాతం వరకూ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ ఎంతవరకూ సరైనవో చెప్పలేం. ఎందుకంటే... జనాభా లెక్కలు సేకరించేవారికి, ఇతరత్రా సర్వేలు చేసేవారికి వైకల్యానికి సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పించకపోతే సరైన గణాంకాలు లభ్యంకావు. కనుక మన జనాభా లెక్కలు వెల్లడించే సంఖ్యను మించి వికలాంగులు ఉండే అవకాశం లేకపోలేదు. అధికారిక గణాంకాలను గమనించినా మన దేశంలో వికలాంగుల సంఖ్య కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువ! వికలాంగుల్లో అధికశాతంమంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారూ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నవారే. బిడ్డ కడుపులో ఉండగా తల్లికి సరైన పోషకాహారం అందకపోవడంవల్లా... తల్లిదండ్రులకు ఆరోగ్యంపై అవగాహన కొరవడటంవల్లా, పోలియో, మశూచి వగైరా అంటువ్యాధులవల్లా, రకరకాల ప్రమాదాలవల్లా వైకల్యం సంభవిస్తుంది. సమాజానికి చోదకశక్తిగా ఉండవలసిన ప్రభుత్వాలు ఇలాంటివారి బాధ్యతను స్వీకరించి ఆదుకోవాల్సి ఉంటుంది. అది వాటి బాధ్యత. కానీ, ఏవో పైపై చర్యలు తప్ప ప్రభుత్వాలేవీ వికలాంగుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేయడంలేదు. వికలాంగుల సంక్షేమానికి సంబంధించిన చేపట్టే పథకాల్లో కూడా ఏకరూపత లేదు. ఒకచోట ఉండే సంక్షేమ పథకం మరో రాష్ట్రంలో లభించదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వికలాంగుల సంక్షేమానికి సంబంధించి ఎన్నో చర్యలు తీసుకున్నారు. వికలాంగులకు అంతక్రితం నెలకు రూ.75 మాత్రమే పింఛనుగా ఇవ్వగా, అధికారంలోకి వచ్చినవెంటనే దాన్ని ఆయన రూ. 200కు పెంచారు. 2007లో దాన్ని రూ. 500 చేశారు. వైకల్యాన్ని బట్టి దీన్ని పెంచే ఏర్పాటుకూడా చేశారు. వికలాంగుల సంక్షేమం కోసమని ప్రత్యేక నిధిని ఏర్పర్చడం, వేర్వేరు గృహ పథకాల్లో వారికి ప్రాధాన్యతనివ్వడం, ఉన్నత చదువులు చదివే వికలాంగులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించడం... బధిర, మూగ పిల్లలకు లక్షల రూపాయలు ఖర్చయ్యే కాక్లియర్ ఆపరేషన్లను ఆరోగ్యశ్రీద్వారా ఉచితంగా చేయించడంవంటి ఎన్నో చర్యలకు ఆయన శ్రీకారం చుట్టారు. కానీ, ఆయన కనుమరుగయ్యాక అలాంటి సంక్షేమ కార్యక్రమాలు మందగించాయి. పింఛన్ల పంపిణీ సక్రమంగా లేకపోవడంవల్ల ప్రతి నెలా వికలాంగులకు అగచాట్లు తప్పడంలేదు. వైకల్యం శాతాన్ని తగ్గించి చూపి పింఛన్లు తొలగించడమూ మొదలైంది. దాదాపు 2 లక్షలమంది ఈరకంగా అనర్హులయ్యారు. ప్రభుత్వాలు ఇలా వికలాంగుల సంక్షేమానికి క్రమేపీ తూట్లు పొడుస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు ఆశావహమైనది. రాజ్యాంగంకిందగానీ, మానవ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగానీ వికలాంగుల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండగా... ఎన్నడో 1995లో రూపొందించిన వికలాంగుల చట్టం ఇంతవరకూ అమల్లోకి రాకపోవడం సిగ్గుచేటైన విషయం. ఉద్యోగమనేది నిజంగా ఒక యోగం. అందునా వికలాంగులకు అది అందరికన్నా మించిన జీవితావసరం. ఒకరిపై ఆధారపడే స్థితిని తప్పించే ముఖ్యావసరం. కానీ, ప్రభుత్వాలు తమ అచేతనత్వంతో అలాంటివారందరికీ 18 ఏళ్లపాటు ఆ యోగాన్ని దక్కకుండా చేశాయి. ప్రజల ద్వారా అధికారంలోకొచ్చే ప్రభుత్వాలు నిజానికి తమంతతామే ఇలాంటి సమస్యలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా... అందుకు భిన్నంగా సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని చెప్పాల్సివచ్చింది. ఇకనైనా పాలకులు తాము ఎంతగా మొద్దుబారుతున్నామో, బండబారుతున్నామో తెలుసుకోవాలి. ఎలాంటి వైకల్యం తమను ఇలా మార్చిందో గుర్తెరగాలి. గుర్తించి సరిదిద్దుకోవాలి.