ఇతడికి ఆకలి బాధ తెలుసు!
‘‘నాకు తెలుసు ఆకలి బాధ ఎలా ఉంటుందో’’ అంటూ దీర్ఘంగా నిట్టూర్చుతారు హేమంత్ పటేల్. మొదటిసారిగా ఆయనకు ఆకలి దెబ్బ తన కూతురు ఆసుపత్రిలో ఉన్నప్పుడు తగిలింది. జేబులో చిల్లిగవ్వలేదు. హాస్పిటల్ బెడ్ మీదున్న కుమార్తె పరిస్థితి దయనీయంగా ఉంది. ఎప్పుడు కళ్లు తెరచిందో తెలీదు. ‘నాన్నా.. ఆకలిగా ఉంది. బయటకెళ్లి ఏదైనా కొనుక్కురా’ అంటూ దీనంగా పలికింది. వెంటనే ఆసుపత్రి గది నుంచి బయటకు వచ్చాడు. కళ్లలో నీరు సుడులు తిరుగుతుండగా జేబులు తడుముకున్నాడు. పది రూపాయలు కూడా అతనికి దొరకలేదు. ‘దేవుడా.. ఎంతటి పరీక్ష పెట్టావురా. కన్నకూతురు పొట్ట నింపలేకపోతున్నాను కదా’ అనుకుంటూ కుమిలిపోయాడు. ఆసుపత్రి వరండాలో కనిపించిన వారందరినీ అడిగాడు. కానీ, ఎవ్వరూ హేమంత్‌కి సాయం చేయలేదు. అప్పుడే అర్థమైంది ఆయనకు.. తనలాగే అక్కడ చాలామంది దగ్గర తిండికి సైతం డబ్బుల్లేవని!
ఎలాగో ఆ పూట గడిచిపోయింది. హేమంత్ కుమార్తె ఆరోగ్యంగా ఇంటికి చేరిపోయింది. రోజులు, నెలలు, ఏళ్లు గడుస్తున్నాయి. అయినా, ఆయన మదిలో ఆసుపత్రి సంఘటన మెదులుతూనే ఉంది. అది ఆయన్ను నిద్రపోనీయడం లేదు. మెల్లగా క్యాటరింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. నెమ్మదిగా వృద్ధిలోకి వచ్చాడు. ఇంతలో ఆయన జీవితంలో మరో మలుపు. 2002 గుజరాత్ అల్లర్లలో హేమంత్ స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మరోసారి ఆయన ఆసుపత్రి మెట్లెక్కాల్సివచ్చింది. బయట వేలాది మంది అభాగ్యులు తమ బంధువుల కోసం ఆకలితో ఆలమటిస్తూ కూర్చున్నారు. వారి దగ్గర పైసా కూడా లేకపోవడం హేమంత్ గమనించాడు. మళ్లీ పాత చేదు జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి. లోపలి నుంచి తన్నుకువస్తోన్న దుఃఖాన్ని నియంత్రించుకోవడం అతని వల్లకాలేదు.
ఆ రాత్రంతా బాగా ఆలోచించాడు. ఆసుపత్రుల్లో ఆకలితో వేచి ఉండేవారికోసం ఏదైనా చెయ్యాలనుకున్నాడు. తన క్యాటరింగ్ సంస్థ నుంచే ఆహారాన్ని ఉచితంగా సరఫరా చేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే 200 మందికి ఆహారాన్ని తయారు చేసి ఆసుపత్రికి వెళ్లి అందించాడు. అన్నం, పప్పు, రోటీ.. ఇలా రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోగులకు, బంధువులకు అందించడాన్ని దినచర్యగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన రోజూ 300 మంది ఆకలి తీర్చగలుగుతున్నాడు. ఇందుకుగానూ నెలకు రూ.60 వేలకుపైగా వెచ్చిస్తున్నాడు. దశాబ్దకాలంగా రోగుల సేవలో మునిగిపోయిన 58 ఏళ్ల హేమంత్‌కు రోజురోజుకీ పెరుగుతోన్న వయసు కూడా అడ్డంకులు సృష్టిస్తోంది. దాతలు, వలంటీర్లు ముందుకు వస్తే ఈ సేవను నిరంతరాయంగా కొనసాగించొచ్చని హేమంత్ పటేల్ చెబుతున్నాడు.