ఇంగ్లాండ్ పత్రికలో గోవిందుడి కవరేజ్
‘‘అది తెలుగు భాషకు సంబంధించిన చిత్రం. భారతీయ చిత్రపరిశ్రమలో అదో భాగం. హైదరాబాద్‌లో ఉంటుంది. తెలుగు చిత్రాలు రూపొందుతున్న పరిశ్రమను ‘టాలీవుడ్’ అంటారు. భారతీయ చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ తర్వాత టాలీవుడ్డే పెద్దది’’... యూకేకి చెందిన ‘హెమల్ హెంప్‌స్టెడ్ గజెట్’ అనే స్థానిక పత్రికలో ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం గురించి ప్రచురితమైన వార్త ఇది. రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ పరిచయ సన్నివేశాలను ఆ మధ్య ఇంగ్లాండ్‌లో చిత్రీకరించారు.
ఈ సన్నివేశాల్లో భాగంగా అక్కడి స్టేడియమ్లో ‘రగ్బీ’ గేమ్‌ని చిత్రీకరించారు. ఇంగ్లాండ్‌లో పెరిగిన గ్రామీణ భారతీయ యువకుని కథ ఇదని సదరు పత్రిక పేర్కొంది. హెమల్ స్టాగ్స్ ఏరియాలోని పెన్నీ వే స్టేడియమ్లో రగ్బీ ఆటను చిత్రీకరించారని, భారతీయ తెరపై తమ స్టేడియమ్ కనిపించనుందని కూడా సదరు పత్రిక పేర్కొంది. అలాగే, రగ్బీ ఆటను చిత్రీకరించడం తనకిది తొలిసారి అని, ఆ ఆట గురించి తనకేం తెలియదని, ఈ సినిమా కోసం సమాచారం సేకరించానని కృష్ణవంశీ తెలిపినట్టు కూడా ఆ పత్రిక ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ఈ సినిమా నిర్మించడం తన పూర్వ జన్మ సుకృతమని నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు.