మాదిగలను అడ్డుకుంటే మనుగడ ఉండదు
అనంతపురం న్యూటౌన్ :
రిజర్వేషన్ల వాటా మాదిగలకు దక్కకుండా అడ్డుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మనుగడ ఉండదని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ హెచ్చరించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కృషి చేస్తానని నమ్మించి వంచనకు గురి చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధిచెప్పేందుకు అన్ని పార్టీల వారూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తారని స్పష్టం చేశారు. ఏపీ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు నేతృత్వంలో శుక్రవారం రాత్రి అనంతపురంలోని ఆర్్ట్స కళాశాల మైదానంలో మాదిగల తిరుగుబాటు మహాసభ జరిగింది. శైలజానాథ్ మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా మాదిగలను సమాజానికి దూరంగా ఉంచుతున్నారని, న్యాయంగా రావాల్సిన రిజర్వేషన్ల వాటాను కూడా అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇటువంటి కుట్రలను సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అనంతలోనే కాదు అమరావతిలో కూడా చంద్రబాబును నిలదీసి మాదిగల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ నేత నారాయణ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ త్యాగాలతో కూడిన ఉద్యమమని, ఎన్ని అడ్డ్డంకులెదురైనా కమ్యూనిస్టు పార్టీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. మాదిగలు తిరగబడితేనే న్యాయం దక్కుతుందన్నారు. ఎంఎస్ రాజుతోపాటు ఎమ్మార్పీఎస్ రాష్ట్రఅధ్యక్షుడు జెన్నే రమణయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సహకరించకపోతే అధికారం అంధకారంలా మారిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కో కన్వీనర్ ఎలీషా, ఎంఈఎఫ్ నాయకులు లాజరస్ తదితరులు సభలో మాట్లాడారు. అంతకు ముందు ఆట పాటలతో కళాకారులు ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, కాంగ్రెస్ నాయకులు దాదాగాంధీ తదితరులు పాల్గొన్నారు.