అనుష్క నేనే మహారాణి
తమిళసినిమా : ‘మహారాణి అంటే నేనే అని నేనడం లేదు. ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు’ అని ఆనందంతో పొంగిపోతున్నారు మేటి నటి అనుష్క. అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, బాహుబలి-2 అంటూ వరుసగా చారిత్రాత్మక కథా చిత్రాలలో మహారాణి పాత్రలు అనుష్కనే వరించడం అదృష్టమో లేక ఆమె నటనా పఠిమకు నిదర్శమో గానీ ఇప్పుడు రాణి పాత్ర అంటే దర్శక, నిర్మాతలకు కళ్ల ముందు మెదిలేది అనుష్కా రూపమే అన్నంతగా ఇమేజ్ను సంపాధించుకున్నారామె. దీనిపై అనుష్క స్పందిస్తూ ‘మహారాణి పాత్రలకు నేను బాగా నప్పాను. అందుకే సినిమాల్లో మహారాణి పాత్రలంటే అనుష్కనే అన్నంతగా ప్రేక్షకుల మదిలో నిలచిపోయాను.
ఆ విధంగా సినిమా మహారాణి నయ్యాననే ప్రశంసలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఈ తరహా పాత్రలకు అరుంధతి చిత్రమే స్ఫూర్తి. బాహుబలి చిత్రంలో నా పాత్ర పరిధి తక్కువే అయినా రెండవ భాగంలో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. రుద్రమదేవి చిత్రంలో మహారాణిగా చాలా పవర్పుల్ పాత్ర చేశాను. ఇందులోని రుద్రమదేవి పాత్ర కోసం చాలా కసరత్తులు చేశాను. కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చుకున్నాను. చిత్రంలో వీరోచిత పోరాట సన్నివేశాలు అద్భుతం అనిపించేలా ఉంటాయి. 3డి ఫార్మెట్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు చారిత్రక కథా చి త్రాలను తీసేందుకు దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.అలాంటి చిత్రాల్లో నటించడానికి నేనూ సిద్ధమే’.