రియల్ హీరో!
ఫొటో స్టోరీ
ఎవరైనా ప్రమాదంలో చిక్కుకోగానే హీరో వచ్చి కాపాడేస్తుంటాడు సినిమాల్లో. నిజ జీవితంలో అలా జరుగుతుందా అని ఆశ్చర్యపోతుంటాం మనం. కానీ కొన్నిసార్లు అలాంటివి నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. అందుకు ఉదాహరణే ఈ చిత్రం.
1997లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వరదలు సంభవించాయి. శాంటా రోసా నగరం నీట మునిగింది. ఇళ్లు నేలమట్టమయ్యాయి. పెద్ద పెద్ద భవంతులు సైతం కుప్ప కూలాయి. ఉధృతంగా వచ్చి ముంచేసిన వరద నీటిలో చాలామంది చిక్కుకుపోయారు. ఈ ఫొటోలో చూపిస్తున్న అమ్మాయి పరిస్థితి కూడా అదే.
సుడులు తిరిగే వరద నీటిలో ఓ చెట్టు ఆధారంగా దొరికింది ఆ అమ్మాయికి. దాన్ని పట్టుకుని, ఎలాగైనా ప్రాణాలు నిలుపుకోవాలని ఆరాటపడిందామె. కానీ ఆమె వల్ల కాలేదు. ఇక మునిగిపోతుంది అనుకున్న సమయంలో రెస్క్యూ టీమ్‌కు చెందిన ఓ అధికారి అక్కడకు వచ్చాడు. వరద నీటికి ఎదురీదుతూ పోయి, ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయిని కాపాడాడు.
హెలికాప్టర్లో పయనిస్తూ వరద బీభత్సాన్ని తన లెన్సులో బంధిస్తోన్న ఫొటోగ్రాఫర్ ఆనీ వెల్స్ ఆ దృశ్యాన్ని ఒడిసిపట్టింది. బ్రేకింగ్ న్యూస్ ఫొటోగ్రఫీ క్యాటగిరీలో ఆ యేడు పులిట్జర్ పురాస్కారాన్ని అందుకుంది!