మార్ మార్ తీన్మార్!
విభిన్న పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నారా రోహిత్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘సావిత్రి’. ఈ చిత్రం కోసం ఓ పాట కూడా పాడారు. నారా రోహిత్, నందిత జంటగా విజన్ ఫిలిం మేకర్ పతాకంపై పవన్ సాదినేని దర్శకత్వంలో డా. వీబీ రాజేంద్రప్రసాద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇందులో నారా రోహిత్ పాడిన ‘మార్ మార్ తీన్మార్... గుండె జారి తీన్మార్’ పాటను నిర్మాత సాయి కొర్రపాటి హైదరాబాద్లో విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ - ‘‘నా మొదటి చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. నిర్మాత బాగుంటేనే మరిన్ని మంచి చిత్రాలు తీస్తారని ఆలోచించి, చక్కని కుటుంబ కథా చిత్రం తీశా. శ్రావణ్ మంచి పాటలిచ్చా’’డన్నారు. ‘‘కుటుంబ సమేతంగా చూసేలా తీర్చిదిద్దాం. మార్చి 4న పాటలు, 25న సినిమా రిలీజ్’’ అని నిర్మాత పేర్కొన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ- ‘‘ ‘సోలో’ తర్వాత మళ్లీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నాయిక నందిత, నటుడు మధు నందన్, మాటల రచయిత కృష్ణ చైతన్య, కెమేరామ్యాన్ వసంత్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జాబిల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.