బ్యాంక్‌ను మోసగించిన కేసులో మాజీ బ్యాంక్ అధికారికి జైలు
న్యూఢిల్లీ: ఓ ప్రభుత్వ బ్యాంక్‌ను రూ. 2.63 కోట్ల మేరకు మోసగించిన ఓ మాజీ బ్యాంక్ అధికారి సహా నలుగురికి కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి గుర్విందర్ పాల్ సింగ్ ‘‘నిందితులు విపుల్ శర్మ, అతని భార్య రజిని, రాజేశ్‌కుమార్, విజయ బ్యాంక్ మాజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హెచ్‌జీ పాయ్ కుమ్మక్కై జాతీయబ్యాంక్ కు భారీ నష్టం కలిగించారు. వీరి కుట్ర కారణంగా ఢిల్లీ కంటోన్మెంట్ విజయబ్యాంక్ రూ. 2.63 కోట్లు నష్టం చవిచూసింది.
ఎలాంటి పూచికత్తు లేకుండా భారీ మొత్తాన్ని నిందితులకు ఇవ్వడం వలన ఈ నష్టం సంభవించింది’’ అని తీర్పులో పేర్కొన్నారు. ‘‘ఎవరైనా ఉద్రిక్తతకు లోనైనప్పుడు హత్యలు చేసే అవకాశం ఉండొచ్చు. ఆర్థిక నేరాలు చేసేవారు మాత్రం వ్యక్తిగత స్వార్థం కోసం కచ్చితమైన ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తారు. ఇది సమాజానికి, దేశానికి హాని కలిగిస్తుంది’’ అని జడ్జి స్పష్టం చేశారు. దోషులకు నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.75 వేల జరిమానా విధించారు.