విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు
పాత గుంటూరు
విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు చెప్పారు. హిందూ కళాశాలలోని ఏకాదండయ్యపంతులు హాలులో ఆదివారం కౌండిన్య సేవాసమితి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే స్మారక పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కన్నా విద్యాసంస్థల డెరైక్టర్ కన్నామాస్టారు అధ్యక్షతన జరిగిన సభలో విశిష్ట అతిథి జస్టిస్ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించడంలో గురువులు ప్రాధాన్యత వహించాలన్నారు. విద్య వ్యాపారంగా మారిందని విమర్శించారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలనే ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. దీంతో విద్యార్థులు పూర్తిగా మాతృభాషను మరిచిపోతున్నారన్నారు. పూలే తన ఉద్యమమంతా విద్యకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. విద్యార్థులు, విద్య సమాజంపై దృష్టి పెట్టాలని తెలిపారు. పిల్లల్లో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామమని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు వాకా రామ్‌గోపాల్‌గౌడ్, రాష్ట్ర మహిళ గౌడ సంఘ అధ్యక్షురాలు యేమినేడి లక్ష్మీశైలజ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయరాజు, బీసీ సంఘ నాయకులు పి.వి.రమణయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతిరావు పూలే ఆశయాలను వివరించారు.
కార్యక్రమాన్ని కౌండిన్య సమితి అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన సలహాదారులు యోగాచార్య ఉయ్యూరి కృష్ణమూర్తి నిర్వహించారు. అనంతరం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, షీల్డ్‌లను అందజేశారు. అనంతరం రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో జస్టిస్ రామలింగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉప్పాల బాలాజీ గౌడ్, కిషోర్, కంచర్ల నాగేశ్వరరావు, రాము, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు.