తెలుగు లో పరీక్షలు రాసుకోండి: మద్రాస్ హైకోర్టు
మాతృభాషలో పరీక్షలు రాసుకునేందుకు వీలు కల్పిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని సాహితీ వేత్త, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తమిళనాడులోని తెలుగు సంఘాల అవిశ్రాంత పోరాట ఫలితంగా, తమిళనాడు బయట ఉన్న తెలుగు వారి సంఘీభావంతో ఎట్టకేలకు హైకోర్టు ఈ ఏడాదికి తమిళనాడులోని భాషా అల్పసంఖ్యాక వర్గాలైన తెలుగు, కన్నడ, మళయాళ, ఉర్దూ మాతృభాష కలిగిన విద్యార్థులకు వారి మాతృభాషలోనే పరీక్షలు రాసుకునేలా తీర్పుఇచ్చిందని అన్నారు. ఈ తీర్పు లక్షలాది విద్యార్థుల భవిష్యత్తును కాపాడిందని చెప్పారు.
అయితే ఇది కేవలం వెసులు బాటు మాత్రమే అని... శాశ్వత పరిష్కారం కోసం తమిళనాడులోని భాషా అల్పసంఖ్యాక వర్గాలు 2006 తమిళ భాషా చట్టాన్ని రద్దు చేస్తామన్న పార్టీకే ఓట్లు వేయాలని కోరుతున్నట్లు వివరించారు. ఈ రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని సమూలంగా రద్దు చేయించడానికి సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు తెలియజేశారు. భారత ప్రభుత్వ హోం శాఖ కూడా రాజ్యాంగంలోని 351 ఏ అధికరణను ఉపయోగించి ఈ రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని రద్దు చేసి తమిళనాడు భాషా అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.