కర్షకుల బతుకుల్లో కరెంట్ మంటలు !
లక్కవరపుకోట : హై పవర్ విద్యుత్ లైన్ల టవర్ల నిర్మాణంలో విద్యుత్ సంస్థలు అనుసరిస్తున్న ైవైఖరి రైతులను భయాందోళనకు గురి చేస్తోంది. ఇంతకు ముందు పవర్ గ్రిడ్ సంస్థ దౌర్జన్యంగా రైతుల భూముల్లో టవర్లు నిర్మించగా, ఇప్పుడు ఏపీ ట్రాన్స్‌కో సంస్థ అదే రీతిలో కొత్తగా లైన్లు వేస్తోంది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఒక పూట తిని, ఒక పూట తినక రెక్కల కష్టంతో సంపాదించుకున్న భూమి విద్యుత్ లై న్ల పుణ్యామాని విలువ లేనిదిగా మారిపోతుంటే ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక గుండెలు బాదుకుంటున్నారు. అందరికీ విద్యుత్ వెలుగులు పంచుతున్న ఆ శాఖ రైతుల బతుకుల్లో మాత్రం చీకట్లు నింపుతోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా వేమగిరి వరకు నిర్మిస్తున్న 765 కేవీఏ లైన్ కోసం పొలాల్లో టవర్లు వేసిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ అధికారులు, సంబంధిత భూమికి చాలా తక్కువ మొత్తంలో నష్టపరిహారం అందజేసి చేతులు దులుపుకొన్నారు.
ఈ పనులు గత ఏడాది నుంచి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో మరడాం నుంచి విశాఖ జిల్లా కలపాక వరకు ఏపీ ట్రాన్స్‌కో సంస్థ 400 కేవీఏ లైన్ ఏర్పాటు చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పొలాల్లో టవర్లు నిర్మించి, పొలం ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవర్‌గ్రిడ్ సంస్థ టవర్లు నిర్మించినప్పుడు చాలా మంది రైతులు నష్టపోయారని, ఇప్పుడు ట్రాన్స్‌కో సంస్థ కొత్తగా టవర్లు, లైన్లు వేస్తుండడంతో మరెంతమందికి ముప్పువాటిల్లనుందోనని భయపడుతున్నారు. సరైన నష్టపరిహారం అందిచేవరకు లైన్ నిర్మాణ పనులు జరగనివ్వబోమని లక్కవరపుకోట, వేపాడ మండలాలకు చెందిన రైతులు కరాఖండీగా చెబుతున్నారు.
పైవర్ పవర్ విద్యుత్ లైన్‌వల్ల రైతులకు జరిగే నష్టం ?
350,400,765 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్మిషన్ లైన్లు వేయడం వల్ల ఒక్కొక్క టవర్ కింద 350 చదరపు మీటర్ల నుంచి 750 చదరపుమీటర్ల భూమి వ్యర్థం అవుతుంది. ట్రాన్స్ మిషన లైన్ల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా ఇరు పక్కల దాదాపు 25 మీటర్ల పరిధిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలులేదు. తోటలు పెంచకూడదు. రెండు టవర్స్ మధ్య సుమారు 10 ఎకరాల భూమి విలువలేనిదిగా మారిపోతుంది. ట్రాన్స్మిషన్ లైన్ల కింద ఉన్న భూములను విక్రయించ కూడదు. అంటే రైతులు తమ భూమిపై పరోక్షంగా హక్కులను కోల్పోతున్నట్లే.
టవర్ల ఏర్పాటులో పాటించాల్సిన నిబంధనలు
టవర్లు నిర్మిస్తున్నట్టు ముందుగా ఆయా పంచాయతీలకు, విద్యుత్ లైన్ వెళ్లే భూమి యజమానులకు... విద్యుత్ సంస్థ ప్రతినిధులు తెలియపర్చాలి. వారికి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి, ఒప్పించి రైతుల అంగీకారాన్ని పొందాలి. ఒకవేళ రైతుకు,సంస్థకు మధ్య అంగీకారం కుదరకపోతే కలెక్టర్ అక్కడి భూముల మార్కెట్ విలువను నిర్ణయించి, 2011 ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ , 2006 లెసైన్సింగ్ యాక్ట్, 2003 విద్యుత్ యాక్టుల ప్రకారం నాలుగు రెట్ల నష్టపరిహారాన్ని రైతులకు ప్రకటించాలి. ఆ నష్టపరిహారాన్ని సంవత్సరం కాలంలో రైతులకు చెల్లించాలి.
ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి ?
విద్యుత్ సంస్థలు కనీస నిబంధనలు పాటించడం లేదు, వారి స్కెచ్ ప్రకారం ఒక సంవత్సరం కాలం ముందే లైన్‌కు సర్వే చేసుకొని టవర్లు నిర్మాణానికి మార్క్ చేసుకుంటున్నారు. హఠాత్తుగా ఒక రోజు మిషనరీతో వచ్చి పనులను ప్రారంభిస్తున్నారు. సంబంధిత భూమి యజమానులు అడ్డగిస్తే పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. నష్టపరిహారం కోసం రైతులు అడిగితే ఇళ్లకు, చెట్లుకు, పంటకు తప్పా, భూమికి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. విద్యుత్ అధికారుల తీరు ప్రైవేట్ గూండాలు భూఆక్రమణ చేస్తున్నట్లుగా ఉంటోందని రైతులు ఆరోపిస్తున్నారు.
నష్టపరిహారం ఇవ్వక్కర్లేదా ?
ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుగా పరిగణిస్తారు. ఒక వేళ ప్రభుత్వం ప్రజలకోసం తీసుకోవాలి అనుకుంటే సరైన నష్టపరిహారం పొందే హక్కు సంబంధిత యజమానికి ఉంటుం ది. ఉత్తరప్రదేశ్, అస్సోం తదితర రాష్ట్రల్లో ట్రాన్స్మిషన్ లైన్ల వల్ల నష్టపోయే రైతుకు భూమికి బదులుగా భూమి, నష్టపరిహారం అందజేశారు. కానీ ప్రస్తుతం జిల్లాలో వేస్తున్న లైన్లకు నష్టపరిహారం ఇవ్వనవసరం లేదని బుకాయిస్తున్నారు. ఈ విషయంపై లక్కవరపుకోట, వేపాడ మండలాలకు చెందిన రైతులు కలెక్టర్‌ను ఆశ్ర యించారు.
నష్టపరిహారం ఇచ్చే వరకు లైన్ల నిర్మాణాలు జరగనివ్వం
కలెక్టర్ ఆదేశాలు మేరకు, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నష్టపరిహారాన్ని ప్రకటిస్తే గాని పనులను జరగనివ్వబోమనిరెతులు చెబుతున్నారు. విద్యుత్లైన్ల కారణంగా నష్టపోతున్న రైతులను ఒకవేదిక పైకి తీసుకొచ్చి పోరాటం చేస్తామని రైతుహక్కుల సాధన సమితి నాయుకులు వేలూరి కమలాకర్ చెప్పారు. మరడాం-కలపాక లైన్ ట్రాన్స్‌కో ఏడీఏ బి.శ్రీనువాసరావును వివరణ కోరగా నిర్మాణ సమయంలో సంబంధిత రైతులకు సమాచారం ఇవ్వవలసిన అవసరం లేదని, అలాగే తహశీల్దార్లకు కూడా చెప్పనవసరం లేదని తెలిపారు. పనులు జరుగుతున్న సమయంలో మాత్రమే సమాచారం అందజేస్తామన్నారు. భూమికి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వబోమని, టవర్ నిర్మాణం జరిగే స్థలంలో చెట్లు ఉంటేనే పరిహారం అందజేస్తామన్నారు. ఈ నిర్మాణ పనులపై లక్కవరపుకోట తహశీల్దార్ ఎమ్.అరుణకుమారిని వివరణ కోరగా తమకు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.