శిఖర పుత్రిక సాగరయాత్ర
మనిషికి.. సింహానికి ఉన్నంత బలం లేకపోవచ్చు. ఏనుగుకు ఉన్నంత భారీ కాయం ఉండకపోవచ్చు. కానీ.. వాటికంటే పదునైన ఆలోచన ఉంది. మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి సాధించి తీరాలి. ఇదీ.. షైలీ బెస్నెత్ ఫిలాసఫీ. ఇరవై నాలుగేళ్ల వయసులో ఆమె ఎవరెస్టును అధిరోహించింది. ముప్పై ఆరేళ్ల వయసుకు ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన శిఖరాలనూ తాకింది! ఆ ఏడు శిఖరాలను అధిరోహించిన తొలి మహిళల బృందానికి నాయకత్వం వహించింది. అయితే షైలీ అంతకన్నా ఎతైన బాధ్యతలనే సమాజంలో మార్పు కోసం భుజానికెత్తుకున్నారు.
‘‘తమ జీవితాల గురించి తాము కలలు కనే అవకాశమైనా ఆడపిల్లలకు ఇవ్వండి. కలలు కనేందుకు అవసరమైన కనీస చదువునైనా వాళ్లను చదువుకోనివ్వండి.. ’’ షైలీ బాస్నెత్ విజ్ఞప్తి ఇది. ఆమె ఈ విజ్ఞప్తి చేస్తున్నది నేపాల్ సమాజానికే అయినప్పటికీ, అంతర్లీనంగా ఇండియానే విజ్ఞప్తి చేసినట్లే. ‘‘ఆడవాళ్లు.. డబ్బు సంపాదన సాధనాలు కాదని, నేపాల్ నుంచి యువతులను అక్రమంగా రవాణా చేస్తున్నవారికి ఇండియా కూడా అడ్డుకట్ట వేయాలని ఆమె కోరుతున్నారు.
నేపాల్‌లో సెక్స్‌రాకెట్, ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులకు పెద్ద మార్కెట్ ఇండియా అని కూడా గుర్తు చేశారు షైలీ బెస్నెత్. నేపాల్‌కు చెందిన పర్వతారోహకురాలు షైలీ బెస్నెత్ శనివారం ఫిక్కీ– వైఎఫ్‌ఎల్‌వో (ఎంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) సమావేశంలో ప్రసంగించడానికి హైదరాబాద్ వచ్చారు. ఎఫ్ఎల్వో (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) అధ్యక్షురాలు శిల్ప దాట్ల ఆధ్వర్యంలో జరిగిన ఆ సమావేశానికి 150 మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. వారిని ఉద్దేశించిన ప్రసంగంలో షైలీ.. ‘సెవెన్ సమ్మిట్స్ ఉమెన్ టీమ్’కి తను నేతృత్వం వహించిన విషయంతోపాటు.. నేపాల్ మహిళల స్థితిగతులను గురించీ మాట్లాడారు.
పైకి కనిపించని ఆంక్షలు
‘‘మాది ఖాట్మండూ. మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్న విద్యావంతులు. మా దేశంలో ఇప్పటికీ మగపిల్లవాడి కోసం ఆడపిల్లలను కంటూ పోవడమనే దురాచారం ఉంది. అమ్మాయిలకు పదహారేళ్లకే పెళ్లిళ్లయిపోతుంటాయి. చదువు ఎలాగూ గగన కుసుమమే. ఇక ఆటల గురించయితే మాట్లాడనే కూడదు. నిజానికి బాలికలకు ఆటలు నిషిద్ధం అనే నిబంధన ఏ సమాజంలోనూ పైకి కనిపించదు, కానీ అమలులో ఉంటుంది. ఆడపిల్లలు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్లు చేస్తే విచిత్రంగా చూస్తారు. అమెరికన్‌తో నా వివాహాన్ని అంగీకరించడం మా సమాజానికి చాలా కష్టమైంది. మా దగ్గర పదేళ్ల కిందట మాత్రమే కరెంటు దీపాలను చూసిన గ్రామాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశంలో.. విద్యావంతుల కుటుంబాల ఆలోచనలు కూడా ఆడపిల్ల జీవితంలో స్థిరపడడం అంటే.. చదువుకుని ఉద్యోగం సంపాదించుకోవడం అన్నంత వరకే. అందుకు మా అమ్మానాన్నలే పెద్ద ఉదాహరణ.
బాధితులే బృంద సభ్యులు
నేపాల్‌లో ఆడపిల్లలు ఇన్ని నిబంధనల మధ్య పెరుగుతుంటే.. అమెరికా వాళ్లు మాత్రం నేపాల్ వాళ్లు అందరూ ఎవరెస్టును అధిరోహించి ఉంటారని నమ్ముతారు. నేపాలీగా పరిచయం చేసుకోగానే ‘‘మీరు ఎవరెస్టును అధిరోహించారా’’ అని అడుగుతారు. నిజానికి నేపాల్‌లో మహిళలకు పర్వతారోహణం వంటి కలలు కనే అవకాశం కూడా తక్కువే. అలాంటి సమయంలో మేము చేసిన సాహసమే.. ‘సాగర్మాత ఎక్స్‌పెడిషన్’. ఎవరెస్టు ఆరోహణ అనేది మా దేశంలో సాహసం కాదు, ప్రకృతిమాతకు శిరసు వంచి అభివందన చేయడం. అందుకే ఎవరెస్టు అధిరోహించిన వాళ్లను దేవతలుగా గౌరవిస్తారు. నేను చేసిన సాహసం ఏమిటంటే.. సమాజంలో రకరకాలుగా వేధింపులకు గురైన మహిళలను సాగర్మాత బృందంలో సభ్యులుగా చేయడమే.
ఆషా అనే ఆమెది నేపాల్‌లో ఉన్న వందకు పైగా తెగల్లో అత్యంత వెనుకబడి తెగ. మాయా అనే అమ్మాయి జీవితం మరో విచిత్రం. పద్నాలుగేళ్ల వయసులో ఆమెకు పెళ్లి నిశ్చయం చేసి వేడుకలు మొదలు పెట్టేశారు. ఇంట్లో వాళ్లు ఆమెను.. ‘ఈ పెళ్లి ఇష్టమేనా?’ అని అడగడం అటుంచండి.. కనీసం.. ‘నీకు పెళ్లి’ అని ఒక్కమాట కూడా చెప్పలేదు! బంధువుల రాక కూడా మొదలైంది. అప్పుడు ఆమె ఇంటి నుంచి పారిపోయింది. అయితే ఎవరెస్టు అధిరోహణ తరవాత వాళ్లకు గౌరవాలు దక్కుతున్నాయి.
మహిళల సాధికారత గురించి, బాలికలకు చదువు గురించి వాళ్లు తమ ఊళ్లలో ఏం చెబితే దానిని అనుసరిస్తున్నారు. మహిళలు సంపూర్ణమైన, సమగ్రమైన సాధికారత సాధించినప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. మా వరకు మేమంతా కలిసి ట్రాఫికింగ్ కోరల్లో చిక్కి ప్రాణాలతో బయటపడిన మహిళలకు సొంతంగా జీవించడానికి ఆసరా అవుతున్నాం. ఉపాధి వృత్తుల్లో శిక్షణనిస్తూ వారికి ఆర్థికంగా స్వయంశక్తి సాధించడంలో సహాయం చేస్తున్నాం . ‘ఎవరెస్ట్ టు ఎంపవర్మెంట్’ అనే కాన్సెప్టుతో నా వంతుగా నేను సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాను’’ అన్నారు షైలీ బెస్నెత్. చెన్నైలో ‘ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం’లో షైలీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
శిఖరాలైనా తలవంచుతాయి
మహిళల్లో పోటీతత్వం ఎక్కువ. పోరాట పటిమ కూడా ఎక్కువే. అందుకే శిఖరాలు కూడా తలవంచుతాయి. నా ఈ నమ్మకమే మొత్తం మహిళలతో ఏడు ఖండాల్లో ఏడు శిఖరాలను అధిరోహించాలనే ఆలోచనకు కారణమైంది. అనుకున్నట్లే మా ఏడుగురు మహిళల బృందం ఆసియా– ఎవరెస్ట్ శిఖరం, ఆస్ట్రేలియా– కిస్కియుజ్కో, యూరప్– ఎల్బ్రస్, ఆఫ్రికా– కిలిమంజరో, సౌత్ అమెరికా– అకాంగువా, నార్త్ అమెరికా– దేనాలి పర్వతం, అంటార్కిటికా– విన్సాన్ మాసిఫ్ శిఖరాలను అధిరోహించింది. ఈ అనుభవాలను క్రోడీకరిస్తూ ‘సెవెన్ సమ్మిట్స్– సెవెన్ చాలెంజెస్ అండ్ సెవెన్ లెసన్స్’ పుస్తకాన్ని ఈ ఏడాది తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను.
– షైలీ బెస్నెత్, మౌంటెనీర్, సోషల్ వర్కర్,
మోటివేషనల్ స్పీకర్, స్టాండప్ కమెడియన్, జర్నలిస్ట్