ఖాకీ వనంగా బెల్జియం!
బ్రస్సెల్స్: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూకలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో బెల్జియం అప్రమత్తమైంది. దాడులు చేస్తున్న వారిలో ఎక్కువమంది బెల్జియానికి చెందినవారే ఉండటంతో ఉలిక్కిపడింది. ఏక్షణమైనా ఇస్లామిక్ స్టేట్ తమపై కూడా దాడులు చేసే ప్రమాదం అతి సమీపంలోనే పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో రాజధాని బ్రస్సెల్స్ ఖాకీవనంగా మారింది. దేశ సరిహద్దుల్లో కాపలాకాసే సైనికులు, ప్రత్యేక శిక్షణ పొందినవారు, పోలీసు బలగాల బూట్ల చప్పుడు ఇప్పుడు బ్రస్సెల్స్ నగరమంతటా అలికిడి చేస్తున్నాయి.
గత శుక్రవారమే అక్కడ అప్రమత్తత ప్రకటించినప్పటికీ తాజాగా మరోసారి హై అలర్ట్ ప్రకటించారు. దాడులు ఒక చోటనే కాకుండా పలు ప్రాంతాల్లో జరిగే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. 'ఆయుధాలు, బాంబులతో వ్యక్తిగత దాడులు ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతంలో జరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు మేం దాని గురించే చర్చించుకుంటున్నాం. కీలకమైన స్థావరాల అన్నింటిలో గట్ట భద్రత ఏర్పాటుచేశాం' అని బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖెల్ తెలిపారు. ఫ్రాన్స్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు చాలామంది బెల్జియం దేశానికి సంబంధించిన వారని తెలియడంతో ఒక్కసారిగా ఆదేశం ఉలిక్కిపడింది. వెంటనే తమ దేశంలో అలర్ట్ ప్రకటించింది.