హైవే టెర్రర్!
* రోజుకు సగటున ముగ్గురి ప్రాణాలు హరీ
* మరో 200 మందికిపైగా తీవ్ర గాయాలు
* క్షతగాత్రులకు అందని తక్షణ వైద్యం
* అందుబాటులో ఉండని అంబులెన్స్‌లు
* సకాలంలో హాజరు కాని వైద్యులు
* ఎక్కడ ప్రమాదం జరిగినా గుంటూరు తరలించాల్సిందే
* జాతీయ రహదారిపై మోగుతున్న మృత్యుఘంటికలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లా పరిధిలోని జాతీయ రహదారి(ఎన్‌హెచ్-5)పై జరుగుతున్న ప్రమాదాల్లో సగటున రోజుకు ముగ్గురి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. సుమారు 200 మందికిపైగా తీవ్రంగా గాయపడుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు తక్షణ వైద్య సౌకర్యం లభించకపోవడం, వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సౌకర్యాలు లేకపోవడం ఈ దుస్థితికి కారణమవుతోంది. క్షతగాత్రులను తరలించే అంబులెన్స్‌ల సంఖ్య పరిమితంగా ఉండడం, జాతీయ రహదారికి సమీపంలో ప్రభుత్వ ఆస్పత్రులు పెద్దగా లేకపోవడం, ఉన్నప్పటికీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. తక్షణ వైద్య సహాయం అందుబాటులోకి వస్తే కొందరి ప్రాణాలనుకాపాడే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో మృతి చెందే వారి సంఖ్య పెరుగుతోంది.
* జిల్లాలో జాతీయ రహదారి నిడివి 85 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. విజయవాడ కనకదుర్గ వారిధి నుంచి (తాడేపల్లి మండలం) నుంచి చిలకలూరిపేట రూరల్ పరిధి మార్టూరు వరకు జాతీయ రహదారి విస్తరించి ఉంది. మంగళగిరి, తాడేపల్లిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లోని బాధితులను అక్కడకి 25 కిలోమీటర్ల దూరంలోని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడుతున్నారు. అంబులెన్స్ లేదా ఇతర రవాణా సౌకర్యాలతో క్షతగాత్రులను గంటలోపు ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంటుంది. దీనికితోడు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకుతోపాటు వైద్యులు రాత్రి సమయాల్లో అందుబాటులో ఉండడంతో కొంత వరకు మృతుల సంఖ్య తక్కువగానే ఉంటోంది.
* కాజ, పెదకాకాని తదితర ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీజీహెచ్‌కు తరలిస్తున్నారు. వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో కొందరి ప్రాణాలైనా నిలబెడుతున్నారు.
* చిలకలూరిపేట, చిలకలూరిపేట రూరల్ పరిధిలోని తాతపూడి, ప్రకాశం జిల్లా మార్టూరు పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లోని క్షతగాత్రుల్లో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు. మార్టూరు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. మార్గమధ్యలో చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నప్పటికీ, అక్కడకు తరలించడం లేదు.
30 పడకల ఈ ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకు అందుబాటులో లేదు. వైద్యులు కూడా ఎక్కువ మంది గుంటూరు నుంచి డైలీ సర్వీస్ చేసే వారే అధికంగా ఉన్నారు. క్షతగాత్రులు వచ్చిన సమయంలో అందుబాటులో ఉండకపోవడంతో ఎక్కువ మందిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రాథమిక చికిత్స లభించినప్పటికీ, క్షతగాత్రులను గుంటూరు తరలించడానికి గంటన్నర సమయం పడుతుండడంతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారు.
* జాతీయ రహదారి సంస్థ పరిధిలో అంబులెన్స్‌లు, కాజా టోల్‌ప్లాజ్ వద్ద ఉన్న అంబులెన్స్‌లు కూడా ప్రమాద సమయాల్లో ఉపయోగపడిన సందర్భాలు తక్కువగానే ఉంటున్నాయి. సృ్పహలేని స్థితిలో ఉన్న బాధితులను గుంటూరు ఆసుపత్రికి తరలిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి లోని 3 అంబులెన్స్‌లు స్థానిక అవసరాలకు వినియోగిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై జరిగే రోడ్డు ప్రమాదాల్లోని క్షతగాత్రులను ఇతర వాహనాల్లోనే ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. తాడేపల్లి వద్ద ఉన్న మణిపాల్, మంగళగిరి వద్ద ఉన్న ఎన్ఆర్ఐ, చౌడవరం వద్ద ఉన్న కాటూరి మెడికల్ కళాశాల అసుపత్రులు పరిధిలోని అంబులెన్సులు క్షతగాత్రుల కోరిక మేరకు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.