Hijab clad Muslim woman
-
Hijab: నిరసనకారులకు గుణపాఠమా?!
హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో అరెస్టయిన అందరికీ ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించి, తగిన గుణపాఠం నేర్పాలని ఇరాన్ పార్లమెంటు తీర్మానించింది. 290 మంది సభ్యులున్న ఇరాన్ పార్లమెంటులో 227 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇరాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మసూద్ సెతాయ్షి నవంబర్ 6వ తేదీన పార్లమెంటు సమావేశమై ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలియజేశారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 15 వేల మంది అరెస్టయ్యారు. నిర్ణయాత్మక శిక్ష అంటే మరణ శిక్షా అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇరాన్ కోర్టులు ఎలా వ్యవహరిస్తాయనేది చూడాలి. మనిషి మనుగడ పూర్తిగా ప్రభుత్వాల చేతిలోకి వెళ్ళిపోవడం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో అవాంఛనీయం. హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో అరెస్టయిన సుమారు 15 వేల మందికి ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించి, తగిన గుణపాఠం నేర్పాలని ఇరాన్ పార్లమెంటు తీర్మానం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి నియమించిన 16 మంది మానవ హక్కుల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. నవంబర్ 11వ తేదీన ఒక ప్రకటన విడుదల చేస్తూ, నిరసనలను, ఉద్యమాలను అణచి వేయాలనే లక్ష్యంతో ఇరాన్ ప్రభుత్వం విధించిన శిక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ప్రాథమికమైన స్వేచ్ఛను సాధించుకోవడానికి చేస్తున్న ఉద్యమాలను అణచివేసే పద్ధతిని మానుకోవాలని కోరారు. ఇప్పటికే... అంటే అక్టోబర్ 29న తెహరాన్ రాష్ట్ర పరిధిలోని ఇస్లామిక్ రివల్యూషన్ కోర్టు ఈ ఉద్యమంలో పాల్గొన్న 8 మందికి మరణశిక్షను విధించింది. ఇరాన్ చట్టం ప్రకారం ‘దేవుడికి వ్యతిరేకంగా యుద్ధం’ అనే నిబంధన ప్రకారం ఈ శిక్షలు విధిస్తారు. అదేవిధంగా అదే కోర్టు ప్రాసిక్యూటర్ మరో వేయిమంది పేర్లను ఈ కేసులో చేర్చారు. దీని తర్వాతనే ఇరాన్ పార్లమెంటు అన్ని కోర్టులకు ఇదే విధమైన కఠిన చర్యలను తీసుకోవాలని తీర్మానించింది. ఒక ఉద్యమంలో పాల్గొన్నందుకు మూకుమ్మడిగా ‘15 వేల మందికి’ పైగా కార్యకర్తలకు ‘నిర్ణయాత్మక’ శిక్ష విధించాలని ఒక ప్రజాప్రతినిధుల సభ తీర్మానం చేయడం ప్రపంచ చరిత్రలోనే చాలా దుర్మార్గమైన చర్య. ఇంతమందికి గుణపాఠం నేర్పాలని ఇరాన్ ప్రభుత్వం ఎందుకు అంతగా ఉద్రేకపడుతున్నదనేది ప్రశ్న. ఇరాన్లో మహిళలు హిజాబ్ ధరించకపోవడం చట్టరీత్యా నేరం. ఎవరైనా ఇరాన్ పీనల్ కోడ్‌లోని ఆర్టికల్ 638లో పేర్కొన్నదాని ప్రకారం హిజాబ్‌ను ఉల్లంఘిస్తే, పదిరోజుల నుంచి రెండు నెలల వరకు జైలు శిక్షను అనుభవించాలి. 55,500 రూపాయల జరిమానాను చెల్లించాలి. ఇంకా అవసరమైతే 74 కొరడా దెబ్బల శిక్షను కూడా అమలు చేస్తారు. కోర్టుకన్నా ముందు హిజాబ్‌ను సక్రమంగా పాటిస్తు న్నారా లేదా అని పర్యవేక్షించడానికి ‘మెరాలిటీ పోలీసు’ ప్రత్యేక విభాగమే ఉంటుంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 13న 22 ఏళ్ళ కుర్దిష్–ఇరానియన్ యువతి మహసా అమీని హిజాబ్‌ను సక్రమంగా ధరించలేదని అరెస్టు చేశారు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులతో ఉంది. తెహరాన్ నగరాన్ని చూడటానికి కుటుంబ సమేతంగా వచ్చింది. అమీనీని పోలీసులు వ్యాన్‌లో ఎక్కించుకొని, తీసుకెళ్ళారు. అదే వాహనంలో ఆమెను కొట్టి, తీవ్రంగా హింసించినట్టు ఆమె సోదరుడు చెప్పారు. ముఖం ఉబ్బిపోయి, కాళ్ళు చేతులు నల్లగా మారిపోయిన స్థితిలో కుటుంబ సభ్యులకు అప్పజెప్పితే, వాళ్ళు హాస్పిటల్లో చేర్చారు. మూడు రోజుల తర్వాత మహసా అమీని మరణించింది. ప్రభుత్వం మాత్రం ఆమె గుండెనొప్పితో బాధపడితే కుటుంబానికి అప్పజెప్పామని ప్రకటించింది. ఈ దారుణానికి నిరసనగా, వేలమంది వీధుల్లోకి వచ్చి ‘మహిళ–జీవితం–స్వేచ్ఛ’ అంటూ యావత్ ప్రపంచమే కదలిపోయే మహిళా ప్రభంజనానికి ఊపిరిలూదారు. ప్రపంచ మహిళా ఉద్యమాల చరిత్రలోనే చిరస్థాయిగా నిలువదగిన మహోద్యమాన్ని ప్రారంభిం చారు. పోలీసులు, భద్రతా బలగాలు తమ నిర్బంధ కాండతో ఉద్యమాన్ని అణచివేయాలని చూశాయి. నిరసన ఆరంభమైన వారం రోజులకే అంటే సెప్టెంబర్ 20న పదహారేళ్ల నికా శకరామీని అపహరించి, చంపేశారు. సెప్టెంబర్ 21న 22 ఏళ్ళ హదీస్ నజఫీ కూడా భద్రతా బలగాల చేతిలో బలైపోయింది. ఈ రెండు ఘటనలూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. ఈ ఉద్యమంలో ఇప్పటి వరకూ 326 మందిని ఇరాన్ భద్రతా దళాలు కాల్చి చంపినట్టు ఇరాన్ మానవ హక్కుల సంస్థ ప్రకటించింది. ఇందులో 43 మంది పిల్లలు, 25 మంది మహిళలున్నారు. ఈ ఉద్యమంలో కేవలం మహిళలే కాకుండా, మగవారు, ప్రత్యేకించి కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు మహిళలకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇది కేవలం హిజాబ్‌కు వ్యతిరేక ఉద్యమం మాత్రమే కాదు, అయాతుల్లాహ్ ఖొమైనీ నాయకత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్బంధ విధానాల పట్ల నిరసన కూడా. ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఈనాటిది కాదు. 1935 నాటికి సాంప్రదాయికంగా అమలులో ఉన్న హిజాబ్ విధానాన్ని రజా షా ప్రభుత్వం సడలించింది. ఇది కచ్చితంగా పాటించాల్సిన నిబంధన కాదని తేల్చి చెప్పింది. అయితే 1979లో ఇరాన్లో సంభవించిన ఇస్లామిక్ విప్లవం తర్వాత మళ్ళీ హిజాబ్‌ను తప్పనిసరి చేశారు. 1983 వరకు ఇది పకడ్బందీగా అమలు జరిగింది. 1979 హిజాబ్ నిర్భంధాన్ని మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ ప్రతిఘటన కొన్ని సడలింపులను తీసుకొచ్చింది. కానీ 1983లో అది మళ్ళీ అమలులోకి తెచ్చారు. అయినా నిరసన ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. మళ్ళీ 2017లో, ఇరాన్ ప్రభుత్వం నిబంధనలను సడలించింది. హిజాబ్‌ను సక్రమంగా ధరించకపోతే, అరెస్టులు ఉండవని చెప్పింది. చిన్న చిన్న జరిమానాలతో సరిపెట్టుకున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణ యాన్ని పోలీసులు పట్టించుకోలేదు. వాళ్ళు పాత పద్ధతిలోనే మహిళలపై వేధింపులను కొనసాగించారు. 2018లో ఫర్హాద్ మెసామీ అనే డాక్టర్ హిజాబ్ ఆంక్షలను సంపూర్ణంగా తొలగించాలని డిమాండ్ చేసినందుకు ఆయన్ని అరెస్టు చేసి, జైలుకి పంపారు. 2019 ఏప్రిల్‌లో నస్రీన్ సోతోదేహ్ అనే మానవ హక్కుల కార్యకర్త జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారని 38 సంవత్సరాల జైలు, 148 కొరడా దెబ్బల శిక్ష విధించారు. 2019 ఆగస్ట్‌లో ఇరాన్ పౌరహక్కుల కార్యకర్త సబా కొర్ద్ అఫ్షారీ బహిరంగంగా తన హిజాబ్‌ను తొలగించినందుకు 24 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. ఇవన్నీ కేవలం దేశభద్రత, దైవదూషణ పేరుతో వేసిన కఠోర శి„ý లేనన్న విషయం మర్చి పోకూడదు. 2022 జూలైలో సెపిదే రష్ను అనే రచయిత్రిని కూడా హిజాబ్ నేరం కింద అరెస్టు చేసి, చిత్రహింసలకు గురిచేశారు. ఆ దెబ్బ లతో ఆమె చాలా రోజులు ఆసుపత్రిలో చికిత్సపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి నిరసనగా వందలాది మంది మహిళలు బహి రంగంగా ముఖం మీద, తలమీద ఉన్న దుస్తులను తొలగించి నిరసన తెలిపారు. 2022 ఆగస్ట్ 15న హిజాబ్ నిబంధనలను మరింత కఠిన తరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిజాబ్ ధరించని మహిళలను ప్రభుత్వోద్యోగాల నుంచి తొలగించడం లాంటి కఠిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు. ఈ పరంపరలోనే సెప్టెంబర్ 13న మహసా అమీనీ అరెస్టు, తదనంతరం ఆమె మరణం ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసింది. ఇరాన్‌లోనే కాదు, చాలా దేశాల్లో ప్రభుత్వాలు ప్రజల జీవి తాల్లోకి, వారి అలవాట్లలోకి చొరబడి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలను నలిపి వేస్తున్నాయి. మన దేశంలో కొన్ని చోట్ల ఇటీవల హిజాబ్ ధరించిన ముస్లిం యువతులను వేధించే సంఘ టనలు జరిగాయి. ఇరాన్లో బలవంతంగా హిజాబ్‌ను అమలు చేయడం, భారత్‌లో తమ ఇష్టాలకు, అభిప్రాయాలకు భిన్నంగా హిజాబ్‌ను తొలగించాలని చూడడం రెండూ తప్పే. ప్రజలు తినే తిండి మీద, ధరించే దుస్తుల మీద, మాట్లాడే భాష మీద, ఆచరించే అల వాట్ల మీద ఆంక్షలు విధించడం, వేధించడం ఎంతమాత్రం వాంఛ నీయం కాదు. ప్రస్తుతం ఇరాన్లో పార్లమెంటు చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలనీ, ఇరాన్ మహిళల హక్కులను రక్షించాలనీ, అంతిమంగా మానవ హక్కులను పరిరక్షించాలనీ ప్రపంచ ప్రజలంతా ఇరాన్ మహిళలకు అండగా నిలబడాలి. మనమంతా ఒక్కటే అనే భావనను ఎలుగెత్తి చాటాలి. మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 81063 22077 -
ఒవైసీ కామెంట్లు.. బీజేపీ కౌంటర్
బీజాపూర్: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజా వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. హిజాబ్ ధరించిన మహిళ భారత్‌కు ప్రధానిగా చూడాలని ఉందంటూ ఒవైసీ కామెంట్లు చేశారు. అంతటితో ఆగకుండా బీజేపీపై విరుచుకుపడ్డారు. మంగళవారం కర్ణాటక బీజాపూర్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశంలోని సెక్యులరిజాన్ని రూపుమాపాలని చూస్తోందని, అందరికీ సమాన అవకాశాలు అనే సిద్ధాంతానికి ఆ పార్టీ పూర్తి వ్యతిరేకమని ఆయన విమర్శించారు. అయితే.. ఒవైసీ కామెంట్లకు.. బీజేపీ బదులిచ్చింది. బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా ట్విటర్లో బుధవారం ఒవైసీపై సెటైర్లు పేల్చారు. హిజాబ్ ధరించే మహిళ ప్రధాని కావాలని ఒవైసీ కోరుకుంటున్నారు. రాజ్యాంగం ఎవరినీ అడ్డుకోదు కూడా. కానీ, హిజాబ్ ధరించిన మహిళ ఏఐఎంఐఎం పార్టీకి ఎప్పుడు ప్రెసిడెంట్ అవుతుంది?. ఒవైసీ కోరిక అక్కడి నుంచే ఎందుకు మొదలు కాకూడదు అంటూ షెహ్జాద్ ట్వీట్ చేశారు. Owaisi ji hopes that a Hijab wearing girl becomes PM of India! Well Constitution bars nobody but do tell us when will a Hijab wearing girl get to become President of AIMIM? Let us start with that? pic.twitter.com/MdG4v0sky6 — Shehzad Jai Hind (@Shehzad_Ind) October 26, 2022 ఇక హిజాబ్ వ్యవహారంలో సుప్రీం జడ్జిలు భిన్నతీర్పులు ఇవ్వడంపైనా ఒవైసీ బీజాపూర్‌లో స్పందించారు. హిజాబ్ ధరించి విద్యాలయాలకు వెళ్లడం పెద్ద సమస్యేమీ కాదని జడ్జి వ్యాఖ్యానించారని ఒవైసీ గుర్తు చేశారు. హలాల్ మాంసం, ముస్లిం టోపీలు, గడ్డాలు.. ఇలా అన్నింటి నుంచి ప్రమాదమని బీజేపీ భావిస్తోంది. ముస్లింల ఆహార అలవాట్లు కూడా వాళ్లకు సమస్యే. ఇస్లాంకు పూర్తి వ్యతిరేకం ఆ పార్టీ. దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి, ఇస్లాం గుర్తింపును ముగించాలన్నదే బీజేపీ అసలు ఎజెండా అని విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి: ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం -
కన్నడనాట ‘హిజాబ్’ రగడ
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో హిజాబ్ గొడవ రాజకీయ రంగు పులుముకుంటోంది. విద్యా సంస్థల్లో యూనిఫాం నిబంధనలు పాటించాల్సిందేనని పాలక బీజేపీ అంటుండగా హిజాబ్‌కు మద్దతుగా విపక్ష కాంగ్రెస్ గొంతు విప్పింది. రాష్ట్రంలో పలుచోట్ల కాలేజీల్లో హిజాబ్ (స్కార్ఫ్) ధరించిన బాలికలను అనుమతించపోవడంపై కొద్ది రోజులుగా దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. వారికి పోటీగా కొందరు స్టూడెంట్లు కాషాయ శాలువాతో క్లాసులకు హాజరవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. జనవరిలో ఉడుపిలోని పీయూ కాలేజీలో స్కార్ఫ్‌తో వచ్చిన ఆరుగురు స్టూడెంట్లను వెనక్కు పంపడంతో మొదలైన ఈ గొడవ తాజాగా కుందాపూర్, బైందూర్తో పాటు బెల్గావీ, హసన్, చిక్‌మగళూరు, శివమొగ్గ, మైసూరు సహా పలు చోట్లకు విస్తరించింది. హిజాబ్ తమ హక్కు అంటూ ఒక వర్గానికి చెందిన విద్యార్థినులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ప్రదర్శనలు చేశా రు. వాటిలో పలుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హిజాబ్‌ను అనుమతించాలన్న డిమాండ్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మద్దతు పలికారు. ఈ గొడవ ద్వారా విద్యార్థినుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. ‘‘చదువుల తల్లి సరస్వతి తన బిడ్డలకు ఎలాంటి తేడా చూప దు. జ్ఞానాన్ని అందరికీ పంచుతుంది’’ అని వసంత పంచమి పర్వదినాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ వాగ్యుద్ధం కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య హిజాబ్ అనుకూల ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. హిజాబ్ ధరించినంత మాత్రాన విద్యా సంస్థల్లోకి రానివ్వకపోవడం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాయడమేనన్నారు. ‘‘హిజాబ్ సాకుతో రాష్ట్రమంతటా మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్నాయి. ఒక వర్గానికి చెందిన బాలికలను చదువుకు దూరం చేయడమే దీని వెనక సంఘ్ పరివార్ ప్రధాన ఎజెండా’’ అని ఆరోపించారు. ఈ గొడవలకు మూలకారకులను తక్షణం అరెస్టు చేయాలని సీఎం బస్వరాజ్ బొమ్మైని డిమాండ్ చేశారు. ‘బేటీ బచావో, బేటీ పడావో’ అని నినాదాలిచ్చే ప్రధాని మోదీకి ఈ గొడవలు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. ఈ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నళిన్‌కుమార్ కటీల్ తోసిపుచ్చారు. సిద్ధరామయ్యే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘ఇక్కడున్నది బీజేపీ ప్రభుత్వం. విద్యా సంస్థలు సరస్వతీ నిలయాలు. హిజాబ్ తదితరాలకు అక్కడ స్థానం లేదు. వాటిల్లో తాలిబన్ తరహా పరిస్థితులను అనుమతించబోం. నియమ నిబంధనలకు అంతా కట్టుబడాల్సిందే’’ అన్నారు. ‘‘ఇప్పుడు హిజాబ్‌ను అనుమతిస్తే తర్వాత బుర్ఖా అంటారు. స్కూళ్లలో మసీదులు కడతామంటారు’’ అని బీజేపీ ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ అన్నారు. ఈ వివాదానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ బాధ్యులేనని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి విమర్శించారు. హిజాబ్‌ను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఉడుపి గవర్నమెంట్ ప్రీ వర్సిటీ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినులు వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు మంగళవారం విచారించనుంది. -
ఇది మా విజయధారణ
‘హిజాబ్’ అంటే స్త్రీలు ధరించే శిరోవస్త్రం. కొందరి దృష్టిలో ఇది చాందసానికి ప్రతీక. కొందరి దృష్టిలో ఇది అస్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి ఆలంబన. ‘హిజాబ్’ ధరించే చదువులో, ఉద్యోగంలో, ఉపాధిలో విజయం సాధించగలమని నిరూపిస్తున్నారు కొందరు స్త్రీలు. ముంబైకి చెందిన సాదియాది కూడా అలాంటి విజయగాథే. హిజాబ్ కేవలం మా వస్త్రధారణ కాదు.. విజయధారణ అంటుంది ఆమె. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ సినిమా గుర్తుంది కదా. హిందీ సినిమా. అందులో ఒక అమ్మాయి తండ్రి అభిప్రాయానికి వ్యతిరేకంగా, అతనికి తెలియకుండా, తల్లి సహాయంతో గిటార్ కొనుక్కొని.. హిజాబే కాదు.. బుర్ఖా కూడా వేసుకొని పాటలు పాడుతూ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ సీక్రెట్‌గా సూపర్ స్టార్ అవుతుంది. రియల్ లైఫ్‌లో కూడా అలాంటి హిజాబ్ స్టార్ ఉంది. జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌గా సాదియా. (ఇన్సెట్లో) సాదియా ముంబై– జోగేశ్వరి (వెస్ట్)లోని ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్’ జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తూ చేయిస్తూ చెమటలు కక్కుతూ తల మీద నుంచి హిజాబ్ (శిరో వస్త్రం) తీయకుండా జిమ్ చేస్తున్న వాళ్లకు సూచనలిస్తూ కనిపించే ఆ అమ్మాయి పేరు సాదియా. ఈమె ఫిట్నెస్ ట్రైనర్ మాత్రమే కాదు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పిస్తుంది. హిజాబ్‌తో ఇటువంటి పనుల్లో ఆడపిల్లలు కనిపించడం అరుదు. కాని సాదియా ఇది నాకు మామూలే అన్నట్టు ఉంంది. ‘అవును.. ఈ సంప్రదాయ వస్త్రధారణ నా ప్రోగ్రెస్‌కు అడ్డుగా అనిపించలేదెప్పుడూ. పైగా నాలో ధైర్యాన్ని నింపింది. అడ్డంకులను ఎదుర్కొంటూ నా లక్ష్యాన్ని చేరుకునే సాహసాన్నిచ్చింది’ అని చెప్తుంది. ‘ఐయామ్ ఏ విన్నర్ విత్ హిజాబ్’ అంటుంది సాదియా. మిగిలిన వివరాలు.. సాదియా వాళ్లది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్. తల్లి స్కూల్ టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. నిజానికి ఈ ఫిట్నెస్ ట్రైనింగ్, మార్షల్ఆర్ట్స్ సాదియా వాళ్లక్క సైమా చేసేదట. తల్లిదండ్రులు ‘మనింట్లో ఆడపిల్లలకు ఇవి తగవు’ అని వారించేసరికి సైమా సైలెంట్ అయిపోయింది. కాని అక్క చేసిన విన్యాసాలు చూస్తూ పెరిగిన సాదియా మాత్రం ఆ అభిరుచిని కెరీర్‌గా మలచుకొని కొనసాగిస్తోంది. ‘వేరే చెప్పక్కర్లేదు కదా.. ఈ రోజు నేనిలా ఉండడానికి స్ఫూర్తి మా అక్కయ్యే అని’ అంటుంది సాదియా. మరి తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదా? ‘చెప్పారు. ఏ సంప్రదాయం రీత్యా వాళ్లు వద్దన్నారో ఆ సంప్రదాయంతోనే కంటిన్యూ చేస్తానని స్థిరంగా చెప్పా. అలా చెప్పే ధైర్యమూ ఇదిగో నా ఈ హిజాబే ఇచ్చింది’ అంటుంది హిజాబ్‌ను చూపిస్తూ. ఆ సాహసంతోనే అమ్మానాన్నను ఒప్పించుకుంది. అయితే ఫిట్నెస్ పట్ల సాదియాకున్న ప్రీతి, మార్షల్ ఆర్ట్స్ అంటే ఆమెకు ఉన్న మక్కువను చూసిన ఒక మౌల్వి (మత గురువు) ‘అమ్మాయిలు వినమ్రంగా, నాజూగ్గా ఉండాలి కాని ఈ వ్యాయామాలు అవీ చేస్తూ అబ్బాయిలా ఉండకూడదు’ అంటూ నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశాడు. ‘నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికే ఇవి చేస్తున్నాను తప్ప కండలు చూపించుకోవడానిక్కాదు’ అని నిర్మొహమాటంగా జవాబిచ్చింది మౌల్వీకి. సమాజంలో ఉన్న భ్రమలకు వ్యతిరేకంగా పోరాడ్డం సాదియా నైజం. ఇదంతా హిజాబ్ చలవే అంటుంది మళ్లీ నవ్వుతూ. ఆమె ధైర్యానికి, శరీరాన్ని స్ప్రింగ్‌లా వంచే ఆమె విన్యా సాలకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడువేల అయిదువందల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆమె పరిచయం ఎందుకు? ఫిబ్రవరి ఒకటవ తేదీ– వరల్డ్ హిజాబ్ డే. ఆ సందర్భంగా ముంబైకి చెందిన ‘అల్ హాది’ అనే స్వచ్ఛంద సంస్థ హిజాబ్ విజయగాథల సమావేశం ఒకటి నిర్వహించనుంది. ‘హిజాబ్ సాధికారతకు చిహ్నం కాని అణచివేతకు కాదు’ అనే పేరుతో ముంబైలోనే వైబీ చవాన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేయనుంది. అందులో సాదియాలా హిజాబ్ ధరించి విజయం సాధించిన మరికొందరు స్త్రీలను సత్కరించనుంది. వీరిలో కాలిగ్రఫి ఆర్టిస్ట్ సల్వా రసూల్, కరాటే రెఫ్రీ షహీన్ అఖ్తర్, విద్యావేత్త అస్మా జైదీ, రాజకీయవేత్త ఫాతీమా ముజఫ్ఫర్, నృత్యకారిణి, బ్లాగర్ హలీమా షైఖ్ వంటి హిజాబ్ విన్నర్స్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సాదియా పాల్గొన తన హిజాబ్ విజయ గాథను వినిపించి తనలాంటి యువతకు స్ఫూర్తినివ్వబోతోంది. ‘మనం ఎంచుకున్న జీవితాన్ని మనం దక్కించుకోవడం అవసరం. సంప్రదాయం ఎప్పుడూ ఏ అడ్డంకినీ సృష్టించదు. సంప్రదాయాన్ని అర్థం చేసుకుంటే దాని ఆసరాతోనే ముందుకు సాగొచ్చు’ అని చెబుతోంది సాదియా. వీరిద్దరూ... చిన్నప్పటి నుంచీ చిత్రకళ పట్ల ఆసక్తి పెంచుకున్న సల్వా రసూల్ తన అభిరుచికి తగ్గట్లే సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రకళలో పట్టా పుచ్చుకున్నారు. ఈమె అరబిక్ ఆర్ట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కాలిగ్రఫి కళలో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సల్వా ‘ఈ కళలో నాకు స్ఫూర్తి ఈ దేశ వారసత్వ సంపదే’ అంటుంది. ఆమె వేసిన చిత్రాలు సౌత్ ఆఫ్రికా, పశ్చిమాసియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా వంటి దేశాల్లో గొప్ప గొప్ప భవంతులకు రాజసాన్నిస్తున్నాయి. సల్వా రసూల్ ఇక అస్మా జైదీ టీచర్ ట్రైనర్. రచయిత్రి. చదువు మీద పిల్లలకు ఆసక్తి కలిగించేందుకు ఆమె చేపట్టిన ‘చదువుదాం’ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ‘బోధన అనేది నా ఉద్యోగం కాదు.. నా ప్యాషన్. మన దేశ భవిష్యత్తు పిల్లలే. వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. దానికే నా జీవితం అంకితం’ అంటుంది అస్మా జైది. అస్మా జైదీ -
మహిళను విమానం నుంచి తోసేశారు!
అమెరికాలో తల చుట్టు పరదా (హిజాబ్) ధరించిన ఓ ముస్లిం మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఎలాంటి కారణం చెప్పకుండానే ఆమెను విమానం నుంచి బయటకు తోసేశారు. ఆమె ఉండటం వల్ల విమానంలో తమకు అసౌకర్యంగా ఉందని కుంటిసాకుతో సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారు. మేరిలాండ్లో నివాసముండే హకిమా అబ్బుల్లె అనే ముస్లిం మహిళ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో చికాగో నుంచి సీటెల్‌కు బయలుదేరింది. విమానంలో సీటు మార్చుకునే వీలుందా? అని ఆమె సిబ్బందిని అడిగింది. సీటును మార్చడానికి బదులు సిబ్బంది ఆమెనే విమానం నుంచి బయటకు గెంటేశారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇలాంటి ఘటన జరుగడం ఇది రెండోసారి. గత నెలలో ఓ ఇరాకీ వ్యక్తి పట్ల కూడా విమాన సిబ్బంది ఇలాగే వ్యవహరించారు. అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ కౌన్సిల్ అధికారి అయిన జైనాబ్ చౌదరి అరబ్బీలో మాట్లాడినందుకు.. ఆయనను విమానం నుంచి బయటకు పంపించారు. హకిమాను విమానం నుంచి బయటకు పంపించడంతో ఎయిర్‌పోర్టు పోలీసులు తిరిగి ఆమెను టికెట్ కౌంటర్ వద్దకు తీసుకొచ్చారు. సోమాలియా మూలాలు ఉన్న ఆమె కొన్ని గంటలపాటు నిరీక్షించిన అనంతరం మరో విమానంలో సీటెల్ చేరుకున్నదని హకిమాను ఉటంకిస్తూ ద బాల్టీమోర్ సన్ పత్రిక తెలిపింది. సరైన కారణమేది చెప్పకుండానే తనను విమానం నుంచి బయటకు పంపించారని, ఇది తనకు బాధ కలిగించిందని ఆమె కన్నీటి పర్యంతమవుతూ హికిమా మీడియాకు తెలిపారు.