ఇది మా విజయధారణ | Special Story On Hijab Sadia | Sakshi
Sakshi News home page

ఇది మా విజయధారణ

Published Tue, Jan 28 2020 5:19 AM | Last Updated on Tue, Jan 28 2020 5:21 AM

Special Story On Hijab Sadia - Sakshi

‘హిజాబ్‌’ అంటే స్త్రీలు ధరించే శిరోవస్త్రం. కొందరి దృష్టిలో ఇది చాందసానికి ప్రతీక. కొందరి దృష్టిలో ఇది అస్తిత్వానికి, ఆత్మవిశ్వాసానికి ఆలంబన. ‘హిజాబ్‌’ ధరించే చదువులో, ఉద్యోగంలో, ఉపాధిలో విజయం సాధించగలమని నిరూపిస్తున్నారు కొందరు స్త్రీలు. ముంబైకి చెందిన సాదియాది కూడా అలాంటి విజయగాథే. హిజాబ్‌ కేవలం మా వస్త్రధారణ కాదు..  విజయధారణ అంటుంది ఆమె.

‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ సినిమా గుర్తుంది కదా. హిందీ సినిమా. అందులో ఒక అమ్మాయి తండ్రి అభిప్రాయానికి వ్యతిరేకంగా, అతనికి తెలియకుండా, తల్లి సహాయంతో గిటార్‌ కొనుక్కొని.. హిజాబే కాదు.. బుర్ఖా కూడా వేసుకొని పాటలు పాడుతూ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తూ సీక్రెట్‌గా సూపర్‌ స్టార్‌ అవుతుంది. రియల్‌ లైఫ్‌లో కూడా అలాంటి హిజాబ్‌ స్టార్‌ ఉంది.

జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా సాదియా. (ఇన్‌సెట్‌లో) సాదియా

ముంబై– జోగేశ్వరి (వెస్ట్‌)లోని ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌’ జిమ్‌లో  ఎక్సర్‌సైజ్‌ చేస్తూ  చేయిస్తూ  చెమటలు కక్కుతూ  తల మీద నుంచి హిజాబ్‌ (శిరో వస్త్రం) తీయకుండా జిమ్‌ చేస్తున్న వాళ్లకు సూచనలిస్తూ కనిపించే ఆ అమ్మాయి పేరు సాదియా. ఈమె ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ మాత్రమే కాదు మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్పిస్తుంది.  హిజాబ్‌తో ఇటువంటి పనుల్లో ఆడపిల్లలు కనిపించడం అరుదు. కాని సాదియా ఇది నాకు మామూలే అన్నట్టు ఉంంది.  ‘అవును.. ఈ సంప్రదాయ వస్త్రధారణ నా ప్రోగ్రెస్‌కు అడ్డుగా అనిపించలేదెప్పుడూ. పైగా నాలో ధైర్యాన్ని నింపింది. అడ్డంకులను ఎదుర్కొంటూ నా లక్ష్యాన్ని చేరుకునే సాహసాన్నిచ్చింది’ అని చెప్తుంది. ‘ఐయామ్‌ ఏ విన్నర్‌ విత్‌ హిజాబ్‌’ అంటుంది సాదియా.

మిగిలిన వివరాలు..
 సాదియా వాళ్లది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌. తల్లి స్కూల్‌ టీచర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. నిజానికి ఈ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్, మార్షల్‌ఆర్ట్స్‌ సాదియా వాళ్లక్క సైమా చేసేదట. తల్లిదండ్రులు ‘మనింట్లో ఆడపిల్లలకు ఇవి తగవు’ అని వారించేసరికి సైమా సైలెంట్‌ అయిపోయింది. కాని అక్క చేసిన విన్యాసాలు చూస్తూ పెరిగిన సాదియా మాత్రం ఆ అభిరుచిని కెరీర్‌గా మలచుకొని కొనసాగిస్తోంది. ‘వేరే చెప్పక్కర్లేదు కదా.. ఈ రోజు నేనిలా ఉండడానికి స్ఫూర్తి మా అక్కయ్యే అని’ అంటుంది సాదియా.

మరి  తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదా?
‘చెప్పారు. ఏ సంప్రదాయం రీత్యా వాళ్లు వద్దన్నారో ఆ సంప్రదాయంతోనే కంటిన్యూ చేస్తానని స్థిరంగా చెప్పా. అలా చెప్పే ధైర్యమూ ఇదిగో నా ఈ హిజాబే ఇచ్చింది’ అంటుంది హిజాబ్‌ను చూపిస్తూ. ఆ సాహసంతోనే అమ్మానాన్నను ఒప్పించుకుంది. అయితే ఫిట్‌నెస్‌ పట్ల సాదియాకున్న ప్రీతి, మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే ఆమెకు ఉన్న మక్కువను చూసిన ఒక మౌల్వి (మత గురువు) ‘అమ్మాయిలు వినమ్రంగా, నాజూగ్గా ఉండాలి కాని ఈ వ్యాయామాలు అవీ చేస్తూ అబ్బాయిలా ఉండకూడదు’ అంటూ నిరుత్సాహపరిచే ప్రయత్నం చేశాడు. ‘నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికే ఇవి చేస్తున్నాను తప్ప కండలు చూపించుకోవడానిక్కాదు’ అని నిర్మొహమాటంగా జవాబిచ్చింది మౌల్వీకి. సమాజంలో ఉన్న భ్రమలకు వ్యతిరేకంగా పోరాడ్డం సాదియా నైజం. ఇదంతా హిజాబ్‌ చలవే అంటుంది మళ్లీ నవ్వుతూ. ఆమె ధైర్యానికి, శరీరాన్ని స్ప్రింగ్‌లా వంచే ఆమె విన్యా సాలకు ఇన్‌స్టాగ్రామ్‌లో మూడువేల అయిదువందల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.
 
ఇప్పుడు ఆమె పరిచయం ఎందుకు?

ఫిబ్రవరి ఒకటవ తేదీ– వరల్డ్‌ హిజాబ్‌ డే. ఆ సందర్భంగా ముంబైకి చెందిన ‘అల్‌ హాది’ అనే స్వచ్ఛంద సంస్థ హిజాబ్‌ విజయగాథల సమావేశం ఒకటి నిర్వహించనుంది. ‘హిజాబ్‌ సాధికారతకు చిహ్నం కాని అణచివేతకు కాదు’ అనే పేరుతో ముంబైలోనే వైబీ చవాన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని చేయనుంది. అందులో సాదియాలా హిజాబ్‌ ధరించి విజయం సాధించిన మరికొందరు స్త్రీలను సత్కరించనుంది. వీరిలో కాలిగ్రఫి ఆర్టిస్ట్‌ సల్వా రసూల్, కరాటే రెఫ్రీ షహీన్‌ అఖ్తర్, విద్యావేత్త అస్మా జైదీ, రాజకీయవేత్త ఫాతీమా ముజఫ్ఫర్, నృత్యకారిణి, బ్లాగర్‌ హలీమా షైఖ్‌ వంటి హిజాబ్‌ విన్నర్స్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో సాదియా పాల్గొన తన హిజాబ్‌ విజయ గాథను వినిపించి తనలాంటి యువతకు స్ఫూర్తినివ్వబోతోంది. ‘మనం ఎంచుకున్న జీవితాన్ని మనం దక్కించుకోవడం అవసరం. సంప్రదాయం ఎప్పుడూ ఏ అడ్డంకినీ సృష్టించదు. సంప్రదాయాన్ని అర్థం చేసుకుంటే దాని ఆసరాతోనే ముందుకు సాగొచ్చు’ అని చెబుతోంది సాదియా.
 
వీరిద్దరూ...
చిన్నప్పటి నుంచీ చిత్రకళ పట్ల ఆసక్తి పెంచుకున్న సల్వా రసూల్‌ తన అభిరుచికి తగ్గట్లే సర్‌ జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చిత్రకళలో పట్టా పుచ్చుకున్నారు. ఈమె అరబిక్‌ ఆర్ట్‌లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కాలిగ్రఫి కళలో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సల్వా ‘ఈ కళలో నాకు స్ఫూర్తి ఈ దేశ వారసత్వ సంపదే’ అంటుంది. ఆమె వేసిన చిత్రాలు సౌత్‌ ఆఫ్రికా, పశ్చిమాసియా, యునైటెడ్‌ కింగ్‌డమ్, అమెరికా వంటి దేశాల్లో గొప్ప గొప్ప భవంతులకు రాజసాన్నిస్తున్నాయి.

సల్వా రసూల్‌


ఇక అస్మా జైదీ టీచర్‌ ట్రైనర్‌. రచయిత్రి. చదువు మీద పిల్లలకు ఆసక్తి కలిగించేందుకు ఆమె చేపట్టిన ‘చదువుదాం’ అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ‘బోధన అనేది నా ఉద్యోగం కాదు.. నా ప్యాషన్‌. మన దేశ భవిష్యత్తు పిల్లలే. వాళ్లను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. దానికే నా జీవితం అంకితం’ అంటుంది అస్మా జైది.

అస్మా జైదీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement