Hijack threat
-
ఎయిర్‌పోర్టులను షేక్ చేసింది గర్ల్‌ఫ్రెండ్ వల్లే..
హైదరాబాద్: తన గర్ల్‌ఫ్రెండ్‌ను టూర్‌కు తీసుకెళ్లే బాధ నుంచి తప్పించుకునేందుకే విమానాలకు హైజాక్ బెదిరింపులు పంపించినట్లు హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు అసలు విషయం చెప్పాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఈ సమయంలోనే గర్ల్‌ఫ్రెండ్ ముంబయి, గోవా టూర్లకు విమానంలో తీసుకెళ్లమందని, అది ఎలా తప్పించుకోవాలో అర్థంకాక, ఆమె టూర్‌కు వెళదామని చెప్పిన రోజే హైఅలర్ట్ విధించేలా ప్లాన్ చేసినట్లు తెలిపాడు. ఈ వారం ప్రారంభంలో హైదరాబాద్‌తోపాటు, ముంబయి, చెన్నై ఎయిర్‌పోర్టుల్లో అప్రమత్తత విధించిన విషయం తెలిసిందే. విమానాలు హైజాక్ వస్తున్నట్లు పలు మెయిళ్లు రావడంతో సంబంధిత ఎయిర్పోర్ట్ అధికారులు హైఅలర్ట్ విధించారు. అనంతరం మెయిల్ పంపించిన వ్యక్తి ఆధారాలకోసం సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఆ మెయిల్ హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. అనంతరం మెయిల్ ఆధారంగా వంశీ చౌదరీ అనే యువకుడిని అరెస్టు చేశారు. అతడిని విచారించగా అసలు విషయం చెప్పాడు. తన గర్ల్‌ఫ్రెండ్ చెన్నైలో ఉంటోందని, ముంబయి, గోవా టూర్‌కు తీసుకెళ్లాలని కోరిందని చెప్పాడు. ట్రాన్స్పోర్ట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న తన వద్ద డబ్బు లేక ఇబ్బంది తలెత్తడంతో ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక ఇలా చేశానని, ఆమె అడగగానే ప్రస్తుతం విమానాశ్రయాల్లో హైఅలర్ట్ విధించారని, విమానాలు రద్దయ్యాయని చెప్పి తప్పించుకున్నానని వివరించాడు. అంతకుముందు ట్రిప్ క్యాన్సిల్ చేసుకుందామని చెప్పినా ఆమె వినిపించుకోకపోవడంతోనే ఇలా చేసినట్లు తెలిపాడు. గతంలో ఇతడిపై రెండు సైబర్ కేసులు ఉన్నాయంట. ప్రస్తుతానికి సైబర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. -
హైజాక్ ముప్పు: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు హైఅలర్ట్!
ముంబై, చెన్నై విమానాశ్రయాలకు కూడా.. న్యూఢిల్లీ: ఏకకాలంలో విమానాలను హైజాక్ చేస్తామని బెదిరిస్తూ ఓ ఈమెయిల్ రావడంతో హైదరాబాద్‌తోపాటు, ముంబై, చెన్నై విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘ముంబై, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల్లో ఏకకాలంలో హైజాక్‌లు చేస్తామని ఆరుగురు చర్చించుకుంటుండగా ఓ మహిళ విన్నదంటూ ఈమెయిల్ వచ్చింది. ఇది బూటకపు ఈమెయిల్ అయ్యే అవకాశముంది. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాం. విమానం ఎక్కే సందర్భంలో భద్రతను ముమ్మరం చేశాం. అత్యవసర ప్రణాళికను అందుబాటులోకి తెచ్చి ఎయిర్‌పోర్టు బాధ్యులందరితో చర్చించాం’ అని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ మీడియాకు తెలిపారు. ముంబై డీసీపీకి ఈ ఈమెయిల్ వచ్చిందని చెప్పారు. దేశంలోని విమానాశ్రయాల భద్రతను సీఐఎస్ఎఫ్ చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ బెదిరింపు ఈమెయిల్, నిఘా వర్గాలు అప్రమత్తం చేయడం నేపథ్యంలో విమానాశ్రయాల్లో జాగిలాల దళాలను రంగంలోకి దించి.. సత్వర ప్రతిస్పందన బృందాలు కూడా అందుబాటులో ఉంచామని, విమానాయాన సంస్థలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించామని ఆయన చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో భద్రతను పెంచినప్పటికీ, ప్రయాణికులు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగని సాధారణ వాతావరణమే ఎయిర్‌పోర్టులలో కొనసాగుతుందని ఓ సీనియర్ విమానాశ్రయ భద్రతాధికారి తెలిపారు. -
'విమానాన్ని హైజాక్ చేస్తా'
దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానాన్ని హైజాక్ చేస్తానంటూ ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. యూసుఫ్ అనే ఆ వ్యక్తి తాను విమానాన్ని హైజాక్ చేస్తానని నేరుగా విమానంలో ఉన్న ఎయిర్హోస్టెస్కే చెప్పాడు. దాంతో విమాన సిబ్బంది ఎయిర్‌పోర్టు వర్గాలను అప్రమత్తం చేశారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసి, యూసుఫ్‌ను అరెస్టు చేశారు.