హైజాక్ ముప్పు: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు హైఅలర్ట్!
- ముంబై, చెన్నై విమానాశ్రయాలకు కూడా..
న్యూఢిల్లీ: ఏకకాలంలో విమానాలను హైజాక్ చేస్తామని బెదిరిస్తూ ఓ ఈమెయిల్ రావడంతో హైదరాబాద్‌తోపాటు, ముంబై, చెన్నై విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘ముంబై, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల్లో ఏకకాలంలో హైజాక్‌లు చేస్తామని ఆరుగురు చర్చించుకుంటుండగా ఓ మహిళ విన్నదంటూ ఈమెయిల్ వచ్చింది. ఇది బూటకపు ఈమెయిల్ అయ్యే అవకాశముంది. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాం. విమానం ఎక్కే సందర్భంలో భద్రతను ముమ్మరం చేశాం. అత్యవసర ప్రణాళికను అందుబాటులోకి తెచ్చి ఎయిర్‌పోర్టు బాధ్యులందరితో చర్చించాం’ అని సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ మీడియాకు తెలిపారు. ముంబై డీసీపీకి ఈ ఈమెయిల్ వచ్చిందని చెప్పారు. దేశంలోని విమానాశ్రయాల భద్రతను సీఐఎస్‌ఎఫ్ చూస్తున్న సంగతి తెలిసిందే.
ఈ బెదిరింపు ఈమెయిల్, నిఘా వర్గాలు అప్రమత్తం చేయడం నేపథ్యంలో విమానాశ్రయాల్లో జాగిలాల దళాలను రంగంలోకి దించి.. సత్వర ప్రతిస్పందన బృందాలు కూడా అందుబాటులో ఉంచామని, విమానాయాన సంస్థలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించామని ఆయన చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో భద్రతను పెంచినప్పటికీ, ప్రయాణికులు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగని సాధారణ వాతావరణమే ఎయిర్‌పోర్టులలో కొనసాగుతుందని ఓ సీనియర్ విమానాశ్రయ భద్రతాధికారి తెలిపారు.