hijack alert
-
విమానంలో హైజాక్ అలారం ఆన్ చేయడంతో..
ఆమ్స్టర్డామ్ : ఆమ్స్టర్డామ్లోని షిపోల్ విమానాశ్రయంలో ఆగిన విమానంలో హైజాక్‌కు సంబంధించిన అలారంను పొరపాటున సెట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో డచ్ పోలీసులు భారీ భద్రతా చర్యలతో ఆపరేషన్‌ను నిర్వహించి అది ఫేక్ అలారం అని నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం డచ్ రాజధాని ఆమ్స్టర్డామ్ నుంచి మాడ్రిడ్‌కు బయలుదేరిన విమానంలో పైలట్ పొరపాటుగా హైజాక్‌కు సంబంధించిన అలారం యాక్టివేట్ చేసినట్లు తెలిసింది. 'విమానం హైజాక్ అయినట్లు మాకు సమాచారం అందడంతో వెంటనే ఎమెర్జెన్సీ టీమ్‌ను పిలిపించి విమానాన్ని అదుపులోకి తీసుకున్నాం. అయితే అది ఫేక్ అలారం అని, పైలట్ తెలియక హైజాక్‌కు సంబంధించిన అలారంను యాక్టివేట్ చేశారు. ఈ సమయంలో విమానంలో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా వారంతా క్షేమంగానే ఉన్నారని, విమానం బయలుదేరే సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నామని' ఎయిర్పోర్ట్ అధికారి వెల్లడించారు. దీంతో బుధవారం రావాల్సిన పలు విమానాలకు అంతరాయం ఏర్పడినటుల అధికారులు తెలిపారు. అంతేగాక విమానంలో హైజాక్‌కు సంబంధించిన అలారం ఎలా యాక్టివేట్ అయిందన్న విషయాన్ని మా ఇన్విస్టేగేషన్‌లో తేలుస్తామని పోలీసులు వెల్లడించారు. తాజా నివేదికల ప్రకారం యూరోప్‌లోనే అత్యంత రద్దీగా ఉండే షిపోల్ విమానాశ్రయంలో సంవత్సరానికి 7 కోట్ల మంది ప్రయాణం చేస్తుంటారు. 'విమానంలో హైజాక్‌కు సంబంధించిన అలారం ఒక్క బటన్‌తో ఆన్ చేయలేము. దానికి నాలుగు అంకెలతో కూడిన ఓ పాస్వర్డ్ ఉంటుంది. దానిని ఎవరైనా ట్రాన్స్మిట్ చేసి ఉంటారని' ఏరోనాటిక్స్ నిపుణుడు జోరిస్ మెల్కెర్ట్ తెలిపారు. -
పైలట్ తప్పిదంతో వణికిన ప్రయాణికులు!
న్యూఢిల్లీ : ఓ విమానానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో హైజాక్ టెన్షన్ వెంటాడింది. రన్ వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న విమానంలో ఆకస్మాత్తుగా హైజాక్ అలారం మోగింది. నిమిషాల వ్యవధిలోనే భద్రతా బలగాలు విమానాన్ని చుట్టుముట్టడంతో.. ఏం జరుగుతుందోనని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అనంతరం పైలట్ రాంగ్ బటన్ నొక్కడంతోనే అలారం మోగిందని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. అరియాన అఫ్గాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 133 మంది ప్రయాణీకులు, సిబ్బందితో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు టేకాఫ్‌కు సిద్ధమైంది. రన్ వే పై నుంచి విమానం గాల్లోకి ఎగురుతుందనగా.. అలారం మోగడంతో అలజడి రేగింది. దీంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో.. గట్టిగా కేకలు వేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు.. పరుగున రన్ వేపైకి వచ్చేశాయి. వెంటనే ఫ్లైట్‌ను చుట్టుముట్టాయి. విమానంలోకి అడుగు పెట్టిన భద్రతా సిబ్బంది ఏం జరిగిందని ఆరా తీయగా.. పైలెట్ పొరపాటున హైజాక్ అలారం బటన్ నొక్కాడని తేలింది. ఈ ఘటనతో విమానం రెండు గంటల ఆలస్యమైంది. -
‘హైజాక్’ నొక్కిన పైలట్
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి కాందహార్(అఫ్గానిస్తాన్) వెళ్తున్న విమానంలో పైలట్ పొరపాటున ‘హైజాక్ మీట’ నొక్కడం తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ విమానాశ్రయంలో శనివారం జరిగిన ఈ ఘటన భద్రతా సిబ్బదిని తెగ హైరానాకు గురిచేసింది. సుమారు రెండు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతే విమానం బయల్దేరింది. 124 మంది ప్రయాణికులతో అరియానా అఫ్గాన్ విమానం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ అవడానికి సిద్ధమవుతుండగా పైలట్ పొరపాటున హైజాక్ మీట నొక్కాడు. వెంటనే స్పందిన ఎన్ఎస్జీ కమాండోలు విమానాన్ని చుట్టిముట్టి రన్‌వేకు దూరంగా తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించారు. పైలట్ పొరపాటున హైజాక్ మీట నొక్కారని నిర్ధారించుకున్నాక విమానం బయల్దేరడానికి అనుమతిచ్చారు. -
హైజాక్ అంటూ ప్రధానికే ట్వీట్
జైపూర్: విమానం హైజాక్ అంటూ నేరుగా ప్రధాని మోదీకే ట్వీటర్ మెసేజ్ పంపించాడో ప్రబుద్ధుడు. దీంతో అధికారులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపించారు. శుక్రవారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానాన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జైపూర్‌లో ల్యాండ్ చేశారు. దీంతో నితిన్ వర్మ అనే ప్రయాణికుడు.. ‘‘మోదీ సర్.. మూడు గంటల క్రితం విమానం ఎక్కాను. పరిస్థితులను చూస్తుంటే విమానం హైజాక్ అయినట్లుగా ఉంది. వెంటనే సాయం చేయగలరు’ అని ప్రధానికి ట్వీట్ చేశాడు. అప్రమత్తమైన భద్రతా దళాలు 176 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ప్రయాణిస్తున్న విమానాన్ని తనిఖీ చేసి హైజాక్ నిజంకాదని తేల్చారు. విమాన ల్యాండింగ్ గురించి ప్రకటన చేసినా.. హైజాక్ అంటూ హడావుడి చేసినందుకు వర్మను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఢిల్లీలో ల్యాండ్ కావాల్సిన ఐదు ఆరు విమానాలను జైపూర్ ఎయిర్‌పోర్టులో దింపినట్లు అధికారులు తెలిపారు. -
హైజాక్ ముప్పు: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు హైఅలర్ట్!
ముంబై, చెన్నై విమానాశ్రయాలకు కూడా.. న్యూఢిల్లీ: ఏకకాలంలో విమానాలను హైజాక్ చేస్తామని బెదిరిస్తూ ఓ ఈమెయిల్ రావడంతో హైదరాబాద్‌తోపాటు, ముంబై, చెన్నై విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘ముంబై, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల్లో ఏకకాలంలో హైజాక్‌లు చేస్తామని ఆరుగురు చర్చించుకుంటుండగా ఓ మహిళ విన్నదంటూ ఈమెయిల్ వచ్చింది. ఇది బూటకపు ఈమెయిల్ అయ్యే అవకాశముంది. అయినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాం. విమానం ఎక్కే సందర్భంలో భద్రతను ముమ్మరం చేశాం. అత్యవసర ప్రణాళికను అందుబాటులోకి తెచ్చి ఎయిర్‌పోర్టు బాధ్యులందరితో చర్చించాం’ అని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ మీడియాకు తెలిపారు. ముంబై డీసీపీకి ఈ ఈమెయిల్ వచ్చిందని చెప్పారు. దేశంలోని విమానాశ్రయాల భద్రతను సీఐఎస్ఎఫ్ చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ బెదిరింపు ఈమెయిల్, నిఘా వర్గాలు అప్రమత్తం చేయడం నేపథ్యంలో విమానాశ్రయాల్లో జాగిలాల దళాలను రంగంలోకి దించి.. సత్వర ప్రతిస్పందన బృందాలు కూడా అందుబాటులో ఉంచామని, విమానాయాన సంస్థలను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించామని ఆయన చెప్పారు. బెదిరింపుల నేపథ్యంలో భద్రతను పెంచినప్పటికీ, ప్రయాణికులు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగని సాధారణ వాతావరణమే ఎయిర్‌పోర్టులలో కొనసాగుతుందని ఓ సీనియర్ విమానాశ్రయ భద్రతాధికారి తెలిపారు. -
మూడు విమానాశ్రయాల్లో హై అలర్ట్
దేశంలో మూడు విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా విభాగాల హైజాక్ హెచ్చరికలతో అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల్లో వరుస హైజాక్‌లు జరిగే అవకాశం ఉందని సమాచారం రావడంతో విమానాశ్రయాల వద్ద భద్రత పెంచారు. 23మందితో మూడు బృందాలు వరుస హైజాక్‌లకు పాల్పడబోతున్నాయనే సమాచారంతో అధికారులు ప్రయాణికులను, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించిన తర్వాత కూడా లగేజీని జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి సూచనలు చేశారు. దీనిపై విమానాశ్రయ భద్రతా కోఆర్డినేషన్ కమిటీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది. భద్రతా విభాగానికి ఓ అజ్ఞాత మహిళ ఈమెయిల్ చేసిందని, ఆరుగురు వ్యక్తులు హైజాక్ గురించి మాట్లాడుకుంటున్నట్లు సమాచారం అందించిందని ఓ అధికారి తెలిపారు. దీనిపై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ మాట్లాడుతూ విమానాశ్రాయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ తనిఖీ విభాగాల వద్ద భద్రతను పెంచినట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు భద్రతా విభాగాలు ఇతర పోలీసు బలగాల సమన్వయంతో పనిచేయనున్నాయి. -
హైజాక్ హెచ్చరికలు :విమానాశ్రయాల్లో హై అలర్ట్!
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా విభాగాల హైజాక్ హెచ్చరికలతో ముందస్తు భద్రతాచర్యలు చేపట్టారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పలు విమానాశ్రయాల వద్ద భద్రత పెంచారు. ముంబయిలోని కల్యాణ్ నుంచి ఐఎస్ఐఎస్లోకి వెళ్లిన అరీబ్ మజీద్ నిర్వహించిన సైబర్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందివ్వాలని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన అధికారులను ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ) సంప్రదిస్తోంది. పరస్పర న్యాయసహకార ఒప్పందం (మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ-ఎంఎల్ఏటీ) కింద సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముంబయిలోని కల్యాణ్‌కు చెందిన అరీబ్ మజీద్తోపాటు మరో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఐఎస్ఐఎస్లో చేరేందుకు ఇరాక్, సిరియా దేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. గత నవంబర్‌లో భారత్‌కు తిరిగి వచ్చిన మజీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మజీద్ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు. ఎన్ఐఏ విచారణలో మజీద్ తెలిపిన వివరాలు: నన్న యుద్ధానికి పంపుతారని భావిస్తే, చాలా నీచమైన పనులు చేయించారు. యుద్ధక్షేత్రంలో ఉన్నవాళ్లకు నీళ్లు అందించడం, టాయిలెట్లు శుభ్రం చేయించడం లాంటివి చేయించారు. నా పైన ఉండే సూపర్వైజర్ చెప్పినా కూడా నన్ను యుద్ధక్షేత్రంలోకి పంపలేదు. చివరకు నాకు బుల్లెట్ గాయం అయినా, మూడు రోజుల వరకు ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో ఉగ్రవాదంపై ఆసక్తి తగ్గిపోయింది. ఆస్పత్రికి వెళ్లడానికి కూడా ప్రాధేయపడాల్సి వచ్చింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అక్కడ చాలామంది మహిళలపై అత్యాచారాలు కూడా చేశారు. నాతో పాటు వచ్చిన ముగ్గురికి ఏకే 47లు, రాకెట్ లాంచర్ల ప్రయోగంలో శిక్షణ ఇచ్చారు. ఐఎస్ఐఎస్లోకి వెళ్లడానికి ముంబైలో తనకు ఎవరెవరు సహకరించారో, అక్కడకు వెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు ఎవరెవరు చేశారన్న వివరాలను సైతం విచారణలో మజీద్ తెలిపాడు.వాళ్లెవరో తెలుసుకునే ప్రయత్నంలో ఎన్ఐఏ ఉంది.