హైజాక్ అంటూ ప్రధానికే ట్వీట్
జైపూర్: విమానం హైజాక్ అంటూ నేరుగా ప్రధాని మోదీకే ట్వీటర్ మెసేజ్ పంపించాడో ప్రబుద్ధుడు. దీంతో అధికారులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపించారు. శుక్రవారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరిన జెట్ ఎయిర్‌వేస్ విమానాన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జైపూర్‌లో ల్యాండ్ చేశారు. దీంతో నితిన్ వర్మ అనే ప్రయాణికుడు.. ‘‘మోదీ సర్.. మూడు గంటల క్రితం విమానం ఎక్కాను. పరిస్థితులను చూస్తుంటే విమానం హైజాక్ అయినట్లుగా ఉంది.
వెంటనే సాయం చేయగలరు’ అని ప్రధానికి ట్వీట్ చేశాడు. అప్రమత్తమైన భద్రతా దళాలు 176 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ప్రయాణిస్తున్న విమానాన్ని తనిఖీ చేసి హైజాక్ నిజంకాదని తేల్చారు. విమాన ల్యాండింగ్ గురించి ప్రకటన చేసినా.. హైజాక్ అంటూ హడావుడి చేసినందుకు వర్మను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఢిల్లీలో ల్యాండ్ కావాల్సిన ఐదు ఆరు విమానాలను జైపూర్ ఎయిర్‌పోర్టులో దింపినట్లు అధికారులు తెలిపారు.