సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశీయ రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు మరిన్ని కష్టాలు తప్పడంలేదు. అనూహ్యంగా విమానాలను రద్దు చేసిన విమర్శల పాలైన జెట్ ఎయిర్‌వేస్ మరోసాకి 14 విమానాలను రద్దు చేసింది. పైలట్ సెలవు కారణంగా దేశీయంగా వివిధ ప్రదేశాలకు ఈ విమానాలను రద్దు చేయడం కలకలం రేపింది.
గత కొన్నినెలలుగా సిబ్బందికి ముఖ్యంగా పైలట్లకు వేతనాలను సక్రమంగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ‍్బందులకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో విధులకు హాజరు కాలేకపోతున్నామంటూ వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో సుమారు 14 సర్వీసులను సంస్థ ఆదివారం రద్దు చేసింది. అనూహ్యంగా విమానాలను రద్దు చేయడంతో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. దీంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు.
జీతం, ఇతర బకాయిలు చెల్లింపుల వ్యవహారంలో జెట్ ఎయిర్‌వేస్ వైఖరిపై జాతీయ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్)కు ఫైలట్లు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం సాకుగా చూపిన పైలట్లు భారీ సంఖ్యలో విధులకు గైర్హాజయ్యారు. అలాగే ఈ పరిస్థితుల్లో పనిచేయలేమంటూ సంస్థ ఛైర‍్మన్ నరేష్‌గోయల్‌కు లేఖ రాసినట్టు కూడా తెలుస్తోంది.
జెట్ ఎయిర్‌వేస్ వివరణ
మరోవైపు దీనిపై స్పందించిన జెట్ ఎయిర్‌వేస్ విమానాల రద్దుకు పైలట్ల నిరసన కారణం కాదని వివరణ ఇచ్చింది. ఊహించని కార్యాచరణ పరిస్థితి మూలంగా విమానాలను రద్దు చేశామని పేర్కొంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. అయితే ఎన్ని సర్వీసులను రద్దు చేసిందీ స్పష్టత ఇవ్వలేదు. కాగా అక్టోబరు, నవంబరు నెలల్లో సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించకపోయినా, సెప్టెంబర్‌లో పాక్షికంగా చెల్లించింది జెట్.
అంతర్జాతీయ సర్వీసుల్లో కోత
ఇది ఇలా వుంటే ఖర్చులను తగ్గించునే క్రమంలో అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న సర్వీసుల్లో వారానికి కొన్నింటిపై కోత పెట్టనుంది. ముఖ్యంగా తొమ్మిది గల్ఫ్ మార్గాల్లో నడిపే విమాన సర్వీసులను తగ్గించనుంది. దేశీయంగా వివిధ నగరాలనుంచి మస్కట్, దోహా, అబుదాభి, దుబాయ్‌కి వెళ్లే విమానాల్లో వారానికి దాదాపు 40విమానాలను రద్దు చేయనుంది. అయితే వివిధ నగరాలనుంచి సింగపూర్, ఖట్మాండు, బ్యాంకాక్ సహా ఇతర గ్లోబల్ రూట్లలో డిసెంబరు 1నుంచి డైరెక్టు విమానాలను పరిచయం చేసినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment