మూడు విమానాశ్రయాల్లో హై అలర్ట్
దేశంలో మూడు విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా విభాగాల హైజాక్ హెచ్చరికలతో అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల్లో వరుస హైజాక్‌లు జరిగే అవకాశం ఉందని సమాచారం రావడంతో విమానాశ్రయాల వద్ద భద్రత పెంచారు. 23మందితో మూడు బృందాలు వరుస హైజాక్‌లకు పాల్పడబోతున్నాయనే సమాచారంతో అధికారులు ప్రయాణికులను, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించిన తర్వాత కూడా లగేజీని జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి సూచనలు చేశారు.
దీనిపై విమానాశ్రయ భద్రతా కోఆర్డినేషన్ కమిటీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసింది. భద్రతా విభాగానికి ఓ అజ్ఞాత మహిళ ఈమెయిల్ చేసిందని, ఆరుగురు వ్యక్తులు హైజాక్ గురించి మాట్లాడుకుంటున్నట్లు సమాచారం అందించిందని ఓ అధికారి తెలిపారు. దీనిపై సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ మాట్లాడుతూ విమానాశ్రాయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ తనిఖీ విభాగాల వద్ద భద్రతను పెంచినట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టు భద్రతా విభాగాలు ఇతర పోలీసు బలగాల సమన్వయంతో పనిచేయనున్నాయి.