ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా విభాగాల హైజాక్ హెచ్చరికలతో ముందస్తు భద్రతాచర్యలు చేపట్టారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు పలు విమానాశ్రయాల వద్ద భద్రత పెంచారు. ముంబయిలోని కల్యాణ్ నుంచి ఐఎస్‌ఐఎస్‌లోకి వెళ్లిన అరీబ్ మజీద్ నిర్వహించిన సైబర్ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందివ్వాలని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాకు చెందిన అధికారులను ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ) సంప్రదిస్తోంది. పరస్పర న్యాయసహకార ఒప్పందం (మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ-ఎంఎల్ఏటీ) కింద సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముంబయిలోని కల్యాణ్కు చెందిన అరీబ్ మజీద్తోపాటు మరో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఐఎస్ఐఎస్లో చేరేందుకు ఇరాక్, సిరియా దేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. గత నవంబర్లో భారత్కు తిరిగి వచ్చిన మజీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మజీద్ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు.
ఎన్ఐఏ విచారణలో మజీద్ తెలిపిన వివరాలు: నన్న యుద్ధానికి పంపుతారని భావిస్తే, చాలా నీచమైన పనులు చేయించారు. యుద్ధక్షేత్రంలో ఉన్నవాళ్లకు నీళ్లు అందించడం, టాయిలెట్లు శుభ్రం చేయించడం లాంటివి చేయించారు. నా పైన ఉండే సూపర్వైజర్ చెప్పినా కూడా నన్ను యుద్ధక్షేత్రంలోకి పంపలేదు. చివరకు నాకు బుల్లెట్ గాయం అయినా, మూడు రోజుల వరకు ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో ఉగ్రవాదంపై ఆసక్తి తగ్గిపోయింది. ఆస్పత్రికి వెళ్లడానికి కూడా ప్రాధేయపడాల్సి వచ్చింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అక్కడ చాలామంది మహిళలపై అత్యాచారాలు కూడా చేశారు. నాతో పాటు వచ్చిన ముగ్గురికి ఏకే 47లు, రాకెట్ లాంచర్ల ప్రయోగంలో శిక్షణ ఇచ్చారు.
ఐఎస్ఐఎస్లోకి వెళ్లడానికి ముంబైలో తనకు ఎవరెవరు సహకరించారో, అక్కడకు వెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు ఎవరెవరు చేశారన్న వివరాలను సైతం విచారణలో మజీద్ తెలిపాడు.వాళ్లెవరో తెలుసుకునే ప్రయత్నంలో ఎన్ఐఏ ఉంది.