Himachal Pradesh accident
-
పదో రోజూ ఫలించని గాలింపు
మండీ: హిమచల్‌ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన 17 మంది విద్యార్థుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలు మంగళవారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. పదో రోజూ ఫలితం శూన్యం. రోజంతా గాలించినా ఒక్క మృతదేహం కూడా దొరకలేదు. మరోవైపు ముందుగా వచ్చిన రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు గాలింపు చర్యలకు సవాల్ గా మారాయి. గల్లంతైన విద్యార్థుల కోసం పదిరోజులుగా అణువణువునా గాలించినా ఫలితం లేకపోయింది. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, నావికా దళానికి చెందిన సైడ్ స్కాన్ సోనార్ పరికరం ఉపయోగించి గాలింపు జరిపినా విద్యార్థుల మృతదేహాల జాడ తెలియలేదు. హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు 24 మంది ఈ నెల 8న బియాస్ నదిలో గల్లంతైన సంగతి తెలిసిందే. -
సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదు: మహేందర్‌రెడ్డి
-
సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదు: మహేందర్‌రెడ్డి
మండీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో విద్యార్థులు గల్లంతైన ఘటనలో విజ్ఞాన్‌జ్యోతి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. యాజమాన్యం బాధ్యత లేకుండా ప్రవర్తించిందని విమర్శించారు. విద్యార్థుల వెంబడి సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లార్జి డ్యాం వద్ద సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు గల్లంతైన ఘటనపై హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఘటన జరిగి ఇన్నాళ్లైనా దర్యాప్తు నివేదిక ఎందుకివ్వలేదని హిమాచల్ ప్రభుత్వ యంత్రాంగంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలీచాలని నష్టపరిహారం ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. నష్టపరిహార మొత్తాన్ని పెంచాలని సూచించింది.