
సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదు: మహేందర్‌రెడ్డి
మండీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో విద్యార్థులు గల్లంతైన ఘటనలో విజ్ఞాన్‌జ్యోతి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. యాజమాన్యం బాధ్యత లేకుండా ప్రవర్తించిందని విమర్శించారు. విద్యార్థుల వెంబడి సీనియర్ ఫ్యాకల్టీలను పంపలేదని తెలిపారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లార్జి డ్యాం వద్ద సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులు గల్లంతైన ఘటనపై హిమాచల్ప్రదేశ్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఘటన జరిగి ఇన్నాళ్లైనా దర్యాప్తు నివేదిక ఎందుకివ్వలేదని హిమాచల్ ప్రభుత్వ యంత్రాంగంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలీచాలని నష్టపరిహారం ఇస్తే ఎలాగని ప్రశ్నించింది. నష్టపరిహార మొత్తాన్ని పెంచాలని సూచించింది.