ఐఏఎస్‌పై హత్యాయత్నం
షిమ్లా: అక్రమ క్వారీలను తనిఖీ చేస్తున్న ఓ ఐఏఎస్ అధికారిపై హిమాచల్‌ప్రదేశ్‌లో ఇసుక మాఫియా హత్యాయత్నం చేసింది. ఆయన వాహనాన్ని ట్రాక్టర్‌తో ఢీకొట్టించడానికి అక్రమార్కులు ప్రయత్నించగా.. ఆ అధికారి త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు ఎస్పీ ఎస్.అరుల్ గురువారం వెల్లడించారు. ‘‘సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) యూనస్ ఖాన్ బుధవారం నలాగఢ్ ప్రాంతంలో అక్రమ క్వారీలను తనిఖీ చేయడానికి వచ్చారు.
రెండు వాహనాల్లో అక్రమంగా ఇసుక, కంకర తరలిస్తుండటాన్ని గుర్తించి, వాటిని ఆపాల్సిందిగా తన సిబ్బందికి ఆదేశించారు. అయితే అందులోని ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఖాన్ అధికారిక వాహనాన్ని ఢీకొట్టడానికి వేగంగా దూసుకొచ్చాడు. ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయిన ఖాన్.. అంతలోనే తేరుకుని త్రుటిలో తప్పించుకున్నారు’’ అని అరుల్ వివరించారు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ మఖాన్సింగ్ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అతడు అక్రమంగా మైనింగ్ చేస్తున్నట్టు నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. అక్రమ తవ్వకాలకు సంబంధించి ఇంకా మరికొన్ని వివరాలు తమకు అందాయని, ఈ అంశంపై దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకుంటామని ఈయన ఈ సందర్భంగా స్పష్టంచేశారు.
ఎస్డీఎం యూనస్ ఖాన్.. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలో సస్పెన్షన్‌కు గురైన ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ బ్యాచ్‌మేట్ కావడం గమనార్హం. కాగా, ప్రభుత్వ ఉద్యోగి విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడంపై కేసు నమోదు చేసినట్టు హిమాచల్‌ప్రదేశ్ డీజీపీ సంయజ్ కుమార్ గురువారం తెలిపారు.