దారి నిండా ‘మేలు’రాళ్లు
హితం
ఇక్కడ మైలురాయిపై కనిపిస్తున్న రోడ్డుప్రమాద హెచ్చరికలు చదివితే డ్రైవింగ్ కంట్రోల్‌పై అవగాహన కలగడంతో పాటు కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు కూడా. హిమాలయ ప్రదేశ్ ప్రాంతం సమీపంలో లెహమానిలి హైవేకి ఎంత ప్రత్యేకత ఉందో ఆ రోడ్డుపక్కనున్న మైలురాళ్ల మీది కొటేషన్లకు కూడా అంతే పేరుంది. అది గమనించిన షెర్పా అనే ఫొటోగ్రాఫర్ ఏకంగా లడక్ రోడ్ సైన్స్ డాట్‌కామ్ పేరుతో ఒక వైబ్సైట్నే తయారుచేసేశాడు.
అందులో కనిపించే మైలురాళ్ళ కొటేషన్లకు బోలెడు లైకులు వస్తున్నాయి. భారత సైనిక దళం ఆధ్వర్యంలో ‘బోర్డర్ రోడ్స్ సంస్థ’ వారు తయారుచేసిన ఈ కొటేషన్లు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. 298 మైళ్ల పొడవున్న ఈ రహదారిపై ప్రయాణించాలంటే కేవలం వేసవికాలంలోనే అనుమతి ఉంటుంది. మిగతారోజుల్లో మంచుకారణంగా ఆ రహదారిని మూసివేస్తారు.
‘‘నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినపుడు ‘ఆఫ్టర్ డ్రింకింగ్ విస్కీ డ్రైవింగ్ ఈస్ రిస్కీ’ అనే కొటేషన్ చదివాను. వెంటనే నా ఫేస్బుక్లో పెడితే మొదటి గంటలోనే ఇరవైమంది స్నేహితుల లైకులు వచ్చాయి. ఇక అక్కడ్నుంచి ఏటా వేసవి వచ్చిందంటే లెహమానిలి రోడ్డుపై వాలిపోయేవాణ్ణి. గత ఆరేళ్ల నుంచి ఇక్కడ 130 మైలురాయిల ఫోటోలు తీసాను.
అన్నింటినీ నా ఫేస్బుక్లో పెట్టడం దేనికి... వీటికోసం ప్రత్యేకంగా ఓ వెబ్సైట్ తయారుచేస్తే పోతుంది కదా! అనుకుని ‘లడక్ రోడ్ సైన్స్ డాట్‌కామ్’ అనే వెబ్సైట్ రూపొందించాను’’ అని చెప్పాడు షెర్పా. ఇంతకీ ఆ రోడ్డుపై వందలసంఖ్యలో ఇలాంటి కొటేషన్లు పెట్టడం వెనక విషయం ఏంటంటే...మెలికలు తిరుగుతూ ఉండే ఆ రోడ్డుపై చాలా ప్రమాదాలు జరిగాయి. వాహనం వేగం పెరిగిందంటే....మలుపు దగ్గర ప్రమాదం గ్యారెంటీ.
దాంతో సరిహద్దు సైనికులు ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ ఇలాంటి మైలురాళ్లను ఏర్పాటు చేశారు. కారణం ఏదైనా... ‘‘ఇఫ్ యు స్లీప్ యువర్ ఫ్యామిలీ విల్ వీప్’, ‘దిస్ ఈజ్ హైవే, నాట్ రన్‌వే’ వంటి కొటేషన్లు వాహన చోదకులకు హితబోధతోపాటు చక్కటి హాస్యస్ఫోరకమైన వాతావరణం కూడా కల్పిస్తున్నాయంటున్నారు అక్కడికి వచ్చే పర్యాటకులు.