ప్రతి హిందూ కుటుంబంలో ముగ్గురు పిల్లలుండాలి
మహాకుంభ్ నగర్: దేశంలో హిందువుల జననాల రేటు పడిపోతుండటంపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందూ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చింది. మహాకుంభ్ నగర్లో శనివారం జరిగిన విరాట్ సంత్ సమ్మేళన్లో వీహెచ్పీ సెంట్రల్ జనరల్ సెక్రటరీ బజ్రంగ్ లాల్ బాంగ్రా మాట్లాడారు. ‘హిందువుల జననాల రేటు పడిపోతుండటంతో దేశంలో హిందూ జనాభాలో అసమతూకం ఏర్పడుతోంది. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలుండాలని హిందూ సమాజంలోని గౌరవనీయులైన సాధువులు కోరుతున్నారు’అని ఆయన అన్నారు. అనంతరం గోరక్షా పీఠా«దీశ్వర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. సనాతన భారత ధర్మం కుంభమేళాలో ప్రత్యక్షంగా కనిపిస్తోందని, యావత్తూ ప్రపంచమే దీన్ని చూస్తోందని అన్నారు. బంగ్లాదేశ్లో ప్రణాళిక ప్రకారం హిందువులపై దాడులు సాగడంపై సమావేశంలో చర్చించారని వీహెచ్పీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య స్వామి వాసుదేవానంద అధ్యక్షత వహించారు.