Hindu gods images
-
ఇమ్రాన్ ‘దేవుడి’ ఫోటోపై పాక్ అసెంబ్లీ ఆగ్రహం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను హిందూ దేవుడిగా అభివర్ణిస్తూ రూపొందిన ఫోటోపై పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో చర్చ జరిగింది. పాక్ అసెంబ్లీలో హిందూ ప్రతినిధులు ఈ అంశాన్ని లేవనత్తెగా సోషల్ మీడియాలో ఈ ఫోటో వ్యాప్తిని అరికట్టాలని, దీన్ని రూపొందించిన వారిని పట్టుకోవాలని దేశీయాంగ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ ఫోటోగ్రాఫ్తో విద్వేష ప్రసంగాలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హిందూ ప్రతినిధులు ఆందోళన చేపట్టగా నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సర్ధార్ అయాజ్ సాధిక్ ఈ అంశాన్ని దేశీయాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఇమ్రాన్ ఖాన్ ముఖాన్ని తగిలించిన ఓ హిందూ దేవత ఫోటోను సభ్యుడు రమేష్ లాల్ స్పీకర్‌కు అందచేశారని డాన్ పత్రిక పేర్కొంది. ఈ అంశంపై విచారణ చేపట్టాలని హిందూ ప్రతినిధులు స్పీకర్‌ను కోరారు. సభ్యుల కోరిక మేరకు వారం రోజుల్లో విచారణ పూర్తిచేయాలని దేశీయాంగ శాఖ అధికారులను ఆదేశించిందని ఆ పత్రిక తెలిపింది. కాగా, దేశంలో హిందువుల ప్రయోజనాల పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడిఉందని ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ స్పష్టం చేసింది. పార్టీ సోషల్ మీడియా విభాగం ఈ ప్రచారాన్ని చేపట్టిందని పీటీఐ వైస్‌చైర్మన్ షా మహ్మద్ ఖురేషీ తెలిపారని డాన్ కథనం పేర్కొంది. తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశం విడిచివెళ్లిన హిందువులు తిరిగి పాకిస్తాన్ చేరుకోవచ్చని 2014లో ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. పాకిస్తాన్లో హిందూ, కలాష్ వర్గీయులను బలవంతంగా మతమార్పిడులకు గురిచేయడం పట్ల కూడా గతంలో ఇమ్రాన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
వివాదంలో చిక్కుకున్న ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్
సాక్షి, లక్నో : ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రచారంలో భాగంగా జావెద్ హబీబ్ తన సెలూన్లలో హిందూ దేవుళ్లు, దేవతల చిత్రాలను, కొన్ని వీడియోలను ఉపయోగింకుంటున్నట్లు వినయ్ పాండే అనే న్యాయవాది మహరాజ్‌గంజ్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులకు హెయిర్ స్టయిలిస్ట్‌గా ఉన్న హబీబ్ ప్రచారం కోసం మత విశ్వాసాలను వాడుకుంటున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను జావేద్ దెబ్బతీశాడని వినయ్ పాండే ఆరోపించారు. హిందూ దేవుళ్లు, దేవతలు తన సెలూన్‌కు వచ్చి కస్టమర్ల మాదిరిగా కూర్చున్నట్లు కొన్ని ప్రకటనల్లో చూపాడని ఇవి సోషల్‌మీడియాలోనూ దర్శనమిచ్చాయని లాయర్ వివరించారు. ఈ కేసును ఈనెల 11వ తేదీన న్యాయస్థానం విచారించనుంది. హిందూ దేవతలు, దేవుళ్ల ఫొటోలను తన సెలూన్లో ఉపయోగించడంపై హిందూ నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి చెత్త ట్రిక్స్ ఎన్ని ప్లే చేసినా నీవద్ద కటింగ్ చేసుకునేందుకు ఎవరూ రారని కొందరు కామెంట్ చేయగా, మర్యాదగా యాడ్స్‌తో పాటు ఫొటోలను అన్ని తీసేస్తే మంచిదంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు.