స్టాక్స్ వ్యూ
ఇండియన్ బ్యాంక్
బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.210
టార్గెట్ ధర: రూ. 245
ఎందుకంటే: తమిళనాడులో అధిక శాఖలున్న దక్షిణాది ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. అత్యధిక ప్రభుత్వ వాటా (81 శాతం) ఉన్న పీఎస్ బ్యాంక్ కూడా ఇదే. 2010-14 కాలానికి రుణాలు 19 శాతం, డిపాజిట్లు 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం 1,24,359 కోట్ల రుణాలిచ్చింది. వీటిలో కార్పొరేట్ రుణాలు 52 శాతం, వ్యవసాయ రుణాలు 15 శాతం, రిటైల్, ఎస్ఎంఈ రుణాలు చెరో 13 శాతంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి10-12 శాతం రేంజ్లో ఉండొచ్చని బ్యాంక్ అంచనా వేస్తోంది.
దేశీయంగా ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో కార్పొరేట్ రుణాలు తగ్గించి, రిటైల్, ఎస్ఎంఈ రుణాలు ఎక్కువగా ఇవ్వాలని బ్యాంక్ నిర్ణయించింది. దేశీయ కాసా వాటా 28 శాతంగా ఉంది. దక్షిణాదిపైననే అధికంగా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించిన ఈ బ్యాంక్ ప్రతీ ఏటా 115 కొత్త బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో రూ.1,245 కోట్లుగా ఉన్న నికర లాభం 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.1,710 కోట్లకు పెరిగింది.
అధిక కేటాయింపులు, డిపాజిట్లపై చెల్లించే అధిక వడ్డీరేట్ల కారణంగా ఆ తర్వాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభం తగ్గింది. నిధుల సమీకరణ వ్యయం తగ్గడం, ట్రేడింగ్ గెయిన్స్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మంచి నికర లాభం ఆర్జించే అవకాశాలున్నాయి. నికర వడ్డీ మార్జిన్ 3 శాతంగా ఉంది. భవిష్యత్తు వృద్ధికి తోడ్పడే మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయి.
హిందుస్తాన్ మీడియా వెంచర్స్
బ్రోకరేజ్ సంస్థ: కోటక్ సెక్యూరిటీస్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.230
టార్గెట్ ధర: రూ.358
ఎందుకంటే: హిందుస్తాన్ మీడియా వెంచర్స్(హెచ్‌ఎంవీఎల్)కు చెందిన హిందుస్తాన్ హిందీ వార్తాపత్రిక భారత్‌లోనే రెండో అతి పెద్ద పత్రిక(ఐఆర్ఎస్-2013 సర్వే). 2011-14 కాలానికి హెచ్‌ఎంవీఎల్ రీడర్షిప్, నిర్వహణ లాభాలు పోటీ పత్రిక సంస్థలతో పోల్చితే పెరిగాయి. ఈ కాలంలో సంస్థ ఇబిటా 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. అతి పెద్ద హిందీ ప్రకటనల మార్కెట్ అయిన ఉత్తరప్రదేశ్‌లో చెప్పుకోదగ్గ సర్క్యులేషన్‌ను సాధించింది. ఇది సంస్థ దీర్ఘకాల వృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతుంది. ఈ వార్తాపత్రిక ప్రచురిత ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో(ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్) త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ కారణంగా రీడర్షిప్ మరింతగా పెరగనున్నది. ఈ అంశాల కారణంగా పరిశ్రమ అంచనాలను మించిన వృద్ధిని హెచ్‌ఎంవీఎల్ సాధిస్తుందని భావిస్తున్నాం. 2014-16 కాలానికి లాభాల్లో వృద్ధి పోటీ సంస్థల కంటే అధికంగా ఉంటుందని అంచనా. ఏడాది కాలానికి ఇబిటా 35%, నికర లాభం 18% చొప్పున వృద్ధి సాధించవచ్చు. మీడియా షేర్లలో ప్రస్తుతం ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న షేర్ ఇదే. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో(డీసీఎఫ్) మదింపు ఆధారంగా టార్గెట్ ధరను నిర్ణయించాం. పత్రికా రంగంలో తీవ్ర పోటీ, ముడి పదార్ధాల ధరలు పెరుగుదల వంటివి ప్రతికూలాంశాలు.
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.