పెద్దన్న పాదాలు తాకి భావోద్వేగంతో మోదీ..
సాక్షి, అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్రమోదీకి అప్యాయతలు అనురాగాలు కాస్తంత ఎక్కువేనని మరోసారి రుజువు చేసుకున్నారు. గురువారం ఓటు వేసేందుకు వచ్చిన ఆయన పోలింగ్ బూత్‌లో అప్పటికే ఉన్న తన సోదరుడిని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే ఆయన పాదాలను తాకి నమస్కరించారు. ఈ దృశ్యం అక్కడ ఓటు వినియోగించుకునేందుకు వచ్చిన వారందరినీ ఆకర్షించింది. గుజరాత్లో తుది దశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని ఓ పాఠశాలలో ఏర్పాటుచేసిన 115వ నెంబర్ పోలీంగ్ బూత్‌లో ఆయన తన ఓటును వినియోగించుకునేందుకు వచ్చారు. తన వంతు వచ్చే వరకు క్యూలో నిల్చొని ఓటు వేసి అక్కడే ఉన్న తన సోదరుడి పాదాలకు నమస్కరించి వెనుదిరిగారు. అనంతరం తన కారు నుంచి 100 మీటర్ల దూరం నడుస్తూ తాను ఓటేసిన సిరా గుర్తు ఉన్న వేలును అక్కడి ఓటర్లకు చూపిస్తూ ముందుకు వెళ్లారు. ఇదిలా ఉండగా మోదీ చర్యపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఓటింగ్ అనంతరం మోదీ చేసింది రోడ్ షో అంటూ వ్యంగ్యంగా అన్నారు. మోదీ ఒక మునిగిపోయే పడవ అని, ఆయనను కాపాడుతోంది ఓటింగ్ యంత్రాలని, పైగా ఎన్నికల సంఘం చర్యలు కూడా మోదీకి నష్టం జరగకుండా చూసుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ నేత రణదీప్ సుర్జేవాల పునరుద్ఘాటించారు.