జీఎంఆర్ చేతికి గ్రీస్ ఎయిర్పోర్ట్
టెర్నా కన్సార్షియంతో కలసి నిర్మాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ కంపెనీ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ మరో ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇన్ఫ్రా దిగ్గజం టెర్నా భాగస్వామ్యంతో గ్రీస్‌లోని క్రీతి నగరంలో ఉన్న హిరాక్లియో విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. నిర్మాణం పూర్తయ్యాక ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ చేపడుతుంది. కన్సెషన్ పీరియడ్ 35 ఏళ్లు. హిరాక్లియో గ్రీస్‌లో రెండో అతిపెద్ద విమాశ్రయం.
నాలుగేళ్లుగా విమాన ప్రయాణికుల సంఖ్య స్థిరంగా వృద్ధి చెందుతోంది. ఏటా 60 లక్షల మందికిపైగా ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారని, ఇంత మంది ప్రయాణికులకు ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ సరిపోవడం లేదని కంపెనీ వెల్లడించింది. అంతర్జాతీయ టూరిస్ట్ కేంద్రం అయిన గ్రీస్‌కు ఏటా 2.4 కోట్ల మంది పర్యాటకులు వెళ్తున్నారు. క్రీతి అతిపెద్ద ద్వీపమే కాదు, అత్యధిక పర్యాటకులు ఆకర్శిస్తున్న కేంద్రం కూడా. నూతనంగా నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయంతో పర్యాటక రంగం మరింత వృద్ధి చెందుతుందని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల ఈ సందర్భంగా తెలిపారు.