52 ఏళ్ల తర్వాత ఖాళీచేస్తున్నాడు
న్యూఢిల్లీ: గుజరాత్లో ఓ వ్యక్తి 52 ఏళ్లుగా కోర్టు ఆదేశాలను పెడచెవినపెడుతూ తాను కిరాయికి ఉంటున్న ఇంటిని ఖాళీ చేయడం లేదు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆయనకు చీవాట్లు పెట్టి ఆ ఇంటిని యజమానికి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. కిరాయిదారుడు నెలలోపు ఖాళీచేయాలని, లేదంటే ఆయన సామాన్లు బయట పడేయాలని పోలీసులకు హుకుం జారీచేసింది. బీఎం పటేల్ అనే వ్యక్తి ఎంకే బ్యారట్‌కు తన ఇంటిని అద్దెకిచ్చారు. ఆ ఇంటిని మరో వ్యక్తికి అద్దెకిచ్చిన పటేల్..బ్యారట్‌ను ఖాళీ చేయించాలనుకున్నాడు. 1965లో ఇందుకు అనుకూలంగా స్థానిక కోర్టు నుంచి ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు.
ఈ నిర్ణయాన్ని సవాలుచేస్తూ బ్యారట్ పిటిషన్ దాఖలుచేసి కేసులో తదుపరి చర్యలు చేపట్టకుండా ఇంతకాలం అడ్డుకున్నారు. గతేడాది గుజరాత్ హైకోర్టు కూడా ఖాళీచేయాల్సిందేనని బ్యారట్‌ను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ సుప్రీంకోర్టు చేరిన ఆయనకి గట్టి దెబ్బే తగిలింది. గురువారం ఈ కేసు విచారణకు రాగా అసలు విషయం తెలిసి జడ్జీలు జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ షాక్‌కు గురయ్యారు. 52 ఏళ్లుగా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న బ్యారట్‌ను తీవ్రంగా మందలించారు. నెలలోపు ఖాళీచేయాలని ఆయన తరఫు లాయర్‌కు స్పష్టం చేశారు.