చారిత్రక వైభవ దీప్తి.. అమరావతి
అమరావతి: చిన్నారులూ.. అమరావతి చూశారా..? మన నూతన రాజధాని పేరు కూడా ఇదేనని మీకు తెలుసు కదా..! మన రాష్ట్రానికే అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన పట్టణం ఇది. ఈ చారిత్రక ప్రదేశాన్ని దర్శిస్తే ఎంతో విజ్ఞానం మీకు అందుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇక్కడి ధ్యానబుద్ధ ప్రాజెక్ట్, పురావస్తుశాఖ మ్యూజియం, పర్యాటక శాఖ ఇంటర్ ప్రిడిక్షన్ సెంటర్ను చూసి తీరాల్సిందే. 2006 జనవరిలో బౌద్ధగురువు దలైలామా ఆధ్వర్యంలో నిర్వహించిన కాలచక్ర మహోత్సవాలకు చిహ్నంగా ధ్యానబుద్ధను రూపొందించారు.
రూపశిల్పి రేగుళ్ల మల్లికార్జునరావు నేతుత్వంలో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 120 అడుగుల ఎత్తులో ధ్యానం చేసే బుద్ధుడి విగ్రహాన్ని నిర్మించటం విశేషం. పాత మ్యూజియంలో అమరావతి స్థూపం (మహాచైత్యం)లో బుద్ధుడి ధాతువులు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ కారణం చేతనే ప్రపంచంలోని భౌద్ధ మతస్తులు జీవితంలో ఒకసారైనా అమరావతి స్థూపాన్ని సందర్శిస్తారు. ఇక్కడ మహాచైత్యం చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదకర వాతావరణం విద్యార్థులను ఆకట్టుకుంటుంది.
కొత్త మ్యూజియంతో అమరావతి చుట్టు పక్కల ప్రాంతాల్లో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో జరిపిన అపురూప శిల్పాలను ఉంచారు. ఇక్కడి అమరేశ్వరాలయం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. అమరేశ్వర స్నానఘట్టం వద్ద లాంచీపై నదీ విహారం చేసే అవకాశం ఉంది. గుంటూరు నుంచి అమరావతికి 18 కిలోమీటర్ల దూరం. గుంటూరు నగరం నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.