సాంస్కృతిక చిరంజీవి
సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్: కమలాకర కామేశ్వరరావు... పౌరాణిక చిత్రాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయన్ను తెలుగు చిత్రసీమ పౌరాణిక బ్రహ్మ అని కీర్తిస్తుంది. భారతీయ-తెలుగు సినిమా శత వసంతోత్సవాల నేపథ్యంలో త్రిపురనేని సాయిచంద్ రూపొందించిన డాక్యుమెంటరీలు నగ రంలో ప్రదర్శిస్తున్నారు. ఇందులో భా గంగా ఆదివారం సాయంత్రం 7 గం టలకు లామకాన్‌లో కమలాకర కామేశ్వరరావుపై డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కమలాకర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు ఆయన తనయలు పానుగంటి లక్ష్మి, శాంతలు.
3 నెలల మనవడికి ఉత్తరాలు!: లక్ష్మి
పౌరాణిక బ్రహ్మగా విఖ్యాతుడైన నాన్నగారిని ‘కల్చరల్ కంటిన్యుటీ’ (సాంస్కృతిక చిరంజీవి)గా ఒక అమెరికా అ మ్మాయి అభివర్ణించింది. ఆయన దర్శకత్వం వహించిన (చంద్రహారం, మహా కవి కాళిదాసు, పాండురంగ మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, గుండమ్మకథ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీకృష్ణ తులాభారం, కృష్ణావతారం, కురుక్షేత్రం) ఏదో ఒక సినిమానో, పాటో టీవీల్లోనో, యూట్యూబులోనో రోజూ లక్షలాది తెలుగువారు ఆస్వాదిస్తుం టారు. వారిలో కొందరు మా గురించీ తెలుసుకుని ఫోన్ చేస్తుంటారు.
నాన్న మమ్మల్ని షూటింగులకు తీసుకెళ్లేవారు కాదు. కాలేజీ ఫ్రెండ్స్ గొడవ చేస్తే ఒకసారి గుండమ్మకథ, మహామంత్రి తిమ్మరుసు షూటింగులకు తీసుకెళ్లారు. బందరులో మొగలాయిల కొలువులో మా తాత పెద్ద ఉద్యోగి. గుర్రపు బగ్గీ ఇంటికి వచ్చేదట. నాన్న పది నెలల వయసపుడే మా తాత పోయారు. పెదనాన్న... నాన్న ఆలనా పాలనా చూశారు. ఆయన సినిమాల్లో నిలదొక్కుకున్నాక బంధువుల కుటుంబాలన్నిటికీ ఆధారంగా నిలి చారు. నాన్న ఎక్కువగా మాట్లేడేవారు కాదు. ఇంట్లో పెద్ద గ్రంథాలయం ఉండేది.
ఉదయం 7 గంటలకు స్టుడియోకు వెళ్తే రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేవారు. ఎప్పుడూ బిజీగా ఉండే నాన్న... నా పెళ్లి అయ్యాక, ము ఖ్యంగా నవీన్ పుట్టాక తనివితీరా మాట్లాడేవారు. మూడు నెలల వయసులో ఉన్న నవీన్‌కు ఉత్తరాలు రాసి, ‘ఒరే ఇవి నీవు పెద్దయ్యాక చదువుకోరా’ అనేవారు. లాండ్స్కేప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న నవీన్ తాత పేరును ఇండస్ట్రీలో మళ్లీ గుర్తుచేస్తున్నాడు. రామానాయుడు వంటి ప్రముఖుల స్టుడియోలు, నివాసాలకు ‘లాండ్స్కేప్’ డిజైనింగ్ చేస్తున్నాడు.
ఆడపిల్లలంటే గారాబం: శాంత
మేం ఐదుగురు సంతానం. రామకృష్ణ ఒక్కడే మగ సంతానం. ఆడపిల్లలమైనా (లక్ష్మీ, శాంత, ఉష, ఉమ) నాన్న మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచారు. ఘంటసాల, గోఖలే, మాధవపెద్ది తదితరులు కుటుంబాలతో తరచూ ఇంటికి వచ్చేవారు. మీ ఇంటికి వస్తే పండుగలా ఉంటుంది అనే వారు మా ఫ్రెండ్స్. మన మైథాలజీని తెలుగువారు గుర్తుంచుకున్నంత కాలం నాన్న జీవించే ఉంటారు. ఆర్ట్ ఈజ్ లాంగ్ కదా.