మసాజ్‌కు వెళ్తే.. హెచ్ఐవీ వచ్చింది
మసాజ్ కేంద్రానికి వెళ్లిన యువకులను రెచ్చగొట్టి.. యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని, అలా వెళ్లిన తనకు హెచ్ఐవీ సోకిందని బాధితుడు నగర పోలీస్ కమిషనర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఆ కేంద్రాన్ని సీజ్ చేసి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాలు మేరకు.. పాత ఎయిర్ పోర్టు రోడ్డులోని దొమ్మలూరులో ఉస్మాన్ అనే వ్యక్తి ఓ మసాజ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీకి చెందిన యువతులతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.
యువతుల అర్ధనగ్న ఫొటోలతో ఇంటర్నెట్లో ప్రచారం చేశాడు. మసాజ్ కేంద్రానికి వెళ్లిన యువకులను రెచ్చగొట్టి యువతులతో వ్యభిచారం చేయించసాగాడు. విటులను ఆకర్షించడానికి ముగ్గురు పింప్‌లను పెట్టాడు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి (29) కొద్ది రోజుల క్రితం ఆ మసాజ్ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఒక యువతికి రూ. 25 వేలు చెల్లించి లైంగిక కోర్కెలు తీర్చుకున్నాడు. ఇటీవల పదేపదే జ్వరం వస్తుండటంతో ఈనెల 11న ఆస్పత్రికి వెళ్లిన అతనికి హెచ్ఐవీ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆ బాధితుడు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. మసాజ్ కేంద్రం ముసుగులో వ్యభిచారం చేయిస్తూ యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆ కేంద్ర నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
దీంతో కమిషనర్ ఆదేశాల మేరకు సీసీబీ పోలీసులు సోమవారం రాత్రి ఆ కేంద్రంపై దాడి చేశారు. ముగ్గురు పింప్‌లను అరెస్టు చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబాయికి చెందిన నలుగురు యువతులను రక్షించారు. పరారీలో ఉన్న ఉస్మాన్ కోసం గాలిస్తున్నట్లు సీసీబీ పోలీసులు మంగళవారం తెలిపారు.