సానియాకు ‘ఖేల్ రత్న’ ఎందుకు?
♦ గిరీష పిటీషన్‌ను విచారించిన కర్ణాటక హైకోర్టు
♦ టెన్నిస్ ప్లేయర్, క్రీడాశాఖకు నోటీసులు
సాక్షి, బెంగళూరు : ప్రతిష్టాత్మక ‘రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న’ అవార్డు విషయంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, కేంద్ర క్రీడాశాఖకు కర్ణాటక హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అవార్డుకు సానియా పేరును ప్రతిపాదించడంపై పారా అథ్లెట్ హెచ్.ఎన్. గిరీష దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన హైకోర్టు జస్టిస్ ఏఎస్ బోపన్న ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. 15 రోజుల్లోగా దీనికి సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. పారా అథ్లెట్ పేరును ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో వివరణ కోరిన హైకోర్టు... అవార్డు ఎంపికకు పాయింట్ల పద్ధతిని పరిగణనలోకి తీసుకున్నారో లేదో తెలపాలని ఆదేశించింది. తనకు అన్ని అర్హతలు ఉన్నా.. అవార్డు విషయంలో తన పేరును పరిగణనలోకి తీసుకోలేదని గిరీష పిటీషన్లో పేర్కొన్నాడు.
అవార్డు విషయంలో సానియా కంటే నాకే ఎక్కువ అర్హతలు ఉన్నాయి. ప్రదర్శన పరంగా తయారు చేసిన జాబితాలో 90 పాయింట్లతో నేను మొదటి స్థానంలో ఉన్నా. నా తర్వాతే టెన్నిస్ స్టార్ ఉంది. నిబంధనల ప్రకారం సానియా వింబుల్డన్ టైటిల్నుపరిగణనలోకి తీసుకోకూడదు. ఈ అవార్డు విషయంలో ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఈ ఈవెంట్ ప్రస్తావనే లేదు. 2011 నుంచి ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సంబంధించిన ప్రదర్శనను మాత్రమే క్రీడాశాఖ పరిగణనలోకి తీసుకోవాలి’ అని గిరీష వ్యాఖ్యానించాడు.
ఇస్తారా... ఇవ్వరా..!
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న సానియా ఖేల్ రత్న అవార్డు అందుకోవాల్సి ఉంది. యూఎస్ ఓపెన్ సన్నాహాల్లో బిజీగాఉన్నా కూడా దీనిని స్వీకరించేందుకు సానియా ఇప్పటికే భారత్ బయల్దేరినట్లు సమాచారం. అయితే తాజా పరిణామంతో ఈ అవార్డు ప్రదానం సందేహంలో పడింది. కోర్టు ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు 15 రోజుల సమయం ఉంది. ముందుగా అవార్డును అందజేసి ఆ తర్వాత కోర్టు వ్యవహారాలు చూసుకోవడం ఒక ఆలోచన. కానీ రేపు తుదితీర్పు గిరీషకు అనుకూలంగా వస్తే ప్రభుత్వం పరువు పోతుంది, అవార్డు వెనక్కి తీసుకోవడం అవమానంగా మారుతుంది!
ప్రస్తుతానికి దీనిని నిలిపివేసి స్పష్టత వచ్చాకే విడిగా సానియాకు అవార్డు ఇవ్వడం మరో ప్రతిపాదన. అయితే గిరీష వాదన బలహీనంగా ఉందని, అతని పిటిషన్ చివరి వరకు నిలవదని కేంద్ర క్రీడాశాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ‘పాయింట్లనే ప్రాతిపదికగా తీసుకుంటే సచిన్, ధోనిలాంటి క్రికెటర్లకు ఈ అవార్డు రానే రాదు. ఆ జాబితాలో క్రికెట్ మ్యాచ్‌లే లేవు. అయినా సానియా దేశం తరఫున ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో కలిపి 2 స్వర్ణాలు సహా 10 పతకాలు గెలిచిన విషయం మరచిపోతే ఎలా’ అని ఆయన ప్రశ్నించారు. కాబట్టి అవార్డు ఇచ్చేందుకే క్రీడాశాఖ మొగ్గు చూపవచ్చు. దీనిపై చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం.