బస్సు రంధ్రంలో నుంచి పడి బాలిక మృతి
ఊట్కూర్, బస్సు రంధ్రంలో నుంచి పడి ఓ బాలిక మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన మారుతి, గోవిందమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. సోమవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో గోవిందమ్మ ముగ్గురు పిల్లలను తీసుకుని నారాయణపేటలో ఉన్న తన చెల్లెలు దగ్గరకు వెళ్లింది. కాపురం అన్నాక సమస్యలు తలెత్తుతాయని సర్దుకుపోవాలని అక్కకు చెల్లెలు సర్దిచెప్పింది. తిరిగి మక్తల్‌కు పంపించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ అద్దె బస్సులో ముగ్గురు పిల్లలతో కలసి అక్కాచెల్లెలు బయలుదేరారు.
వారు కూర్చున్న సీటు కింద డీజిల్ ట్యాంకు మరమ్మతు కోసం బస్సు నిర్వాహకులు రంధ్రాన్ని చేసి దాన్ని మూయకుండా గోనెసంచి కప్పి వదిలేశారు. దీన్ని గమనించని గోవిందమ్మ కుమార్తె స్వాతి(7) మార్గమధ్యంలోని ఊట్కూర్ మం డలం మొడల్ సమీపంలోకి బస్సు చేరుకుంటున్న సమయంలో సీటు దిగి గోనె కప్పి ఉన్న రంధ్రం పై కాలు వేయడంతో ఆమె కింద పడి అక్కడిక క్కడే దుర్మరణం చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వాహన యాజమాని, ఆర్టీసీఅధికారులు, డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.