ఎన్కౌంటర్లో పౌరుడి మృతి
శ్రీనగర్: కశ్మీర్లో సైనికులకు, మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ప్రాణాలు కోల్పోతున్న సాధారణ పౌరుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం అర్థరాత్రి సైనిక బలగాలకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఓ పౌరుడు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సీనియర్ పోలీస్ అధికారి అందించిన వివరాల ప్రకారం కుల్లాంగ జిల్లా రెద్వానీ బాలా గ్రామంలో జరిగిన హోరాహోరీ పోరులో అవిఫ్ రషీద్ అనే వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
బిలాల్ అహ్మద్ అనే మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వార్త తెలిసిన వెంటనే గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ఎదుట గుమిగూడి ఆందోళన చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈసందర్భంగా కోపోద్రిక్తులైన ఆందోళన కారులు సైనిక బలగాలతో ఘర్షణకు దిగిన రాళ్ళ వర్షం కురిపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.