ప్రతిరోజూ ఓ ప్రేమ కథే...
బహుశా 1995 ఏప్రిల్‌లో అనుకుంటాను. ‘రీడర్స్ డెజైస్ట్’ సంచికలో ఓ యదార్థ గాథ చదివాను. అమెరికాలో జరిగిన సంఘటన అది. ఓ భార్యాభర్తలు. వాళ్లకి ఇద్దరు పిల్లలు. చిన్నపాటి అభిప్రాయ భేదాలతో ఆ బాంధవ్యం కలిసి ఉండాలా, విడిపోవాలా అనేంత ఊగిసలాటలో ఉంది. అనుకోకుండా భార్యకి యాక్సిడెంట్ అయింది. ఆమ్నీషియా (మతిమరుపు)కి లోనయ్యింది. తనకి పెళ్లయిందని గాని, భర్తా పిల్లలున్నారనే విషయం కాని ఏమాత్రం గుర్తులేదు. అన్నింటినీ, అందరినీ మరిచిపోయింది.
ఆ భర్త ఆమెని తిరిగి ప్రేమించడం ప్రారంభించాడు. ప్రతిరోజూ ఆమెని ప్రేమిస్తూనే ఉన్నాడు. తన మీద ప్రేమనే కాదు, తన మీద కోపాన్ని కూడా మర్చిపోయింది కాబట్టి ఆమెని ప్రేమించడంలో గొప్ప ఆనందం ఉందన్నాడు భర్త. ఆ ప్రేమకథ నన్ను వెంటాడింది. ఆ సంఘటన ఆధారంగా ఓ స్క్రిప్ట్ రాసి, అప్పటి ప్రముఖ దర్శకుల్లో ఒకరైన ఇ.వి.వి. సత్యనారాయణ గారిని కలిశాను. శ్రీకాంత్ హీరోగా సినిమా రూపొందించడానికి ఆయన ఉత్సాహం చూపించారు. అయితే ఒక దశలో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
‘ప్రేమించిన మనిషికి మతిమరుపు వరం’ అన్నారు ఆత్రేయ. మనిషే కాదు. తెలుగు సినిమాకి కూడా మతిమరుపు బాక్సాఫీస్ ఇచ్చిన గొప్ప వరం. ఆనాటి పవిత్ర బంధం (అక్కినేని), చీకటి వెలుగులు, వసంత కోకిల, ముద్దుల ప్రియుడు నుంచి నిన్నటి ‘గోపి-గోపిక-గోదావరి’ వరకూ ప్రూవ్ అయిన సక్సెస్ఫుల్ ఫార్ములా ఇది. ఈ గతం మర్చిపోవడం మీద చాలా వెటకారాలు, పేరడీలు కూడా వచ్చాయి. అది వేరే సంగతి.
2004లో నేను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌గారి దగ్గర స్క్రిప్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు ‘50 ఫస్ట్ డేట్స్’ అనే సినిమా చూశాను. ‘రీడర్స్ డెజైస్ట్’లోని యదార్థ గాథ గుర్తొచ్చింది. ఆ సినిమా ప్రేరణతో జగన్‌గారు తన తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా ఓ సినిమా చేద్దామనుకున్నారు. హీరోకి షార్ట్ టైమ్ మెమరీలాస్. తను ప్రేమించిన అమ్మాయిని కూడా మర్చిపోతాడు. ఇలాంటి లైన్స్‌తో స్క్రిప్ట్ చేసి పక్కన పెట్టేశారు.
⇔ అడామ్ సాండ్లర్ హెన్రీ రూత్‌గా, డ్రూ బారీమోర్ లూసీగా నటించారు. జార్జి వింగ్ రచయిత కాగా, పీటర్ సీగల్ దర్శకుడు.
⇔ 75 మిలియన్ డాలర్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం 197 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
⇔ఈ సినిమాలో ఆమ్నీషియా పేషెంట్ అయిన హీరోయిన్‌కి డైలీ రొటీన్ షూట్ చేసి, ఆ మరుసటిరోజు వీడియో టేప్ చూపించడం అనే కాన్సెప్ట్ - నిజ జీవితంలో చాలామంది మతిమరపు వ్యాధిగ్రస్తులకి డాక్టర్లు సూచించారు. అమలు చేసి, సక్సెస్ అయ్యారు కూడా.
⇔ తెలుగులో భూమిక హీరోయిన్గా వచ్చిన ‘సత్యభామ’ చిత్రానికి ఇదే స్ఫూర్తి.
⇔ అలాగే మలయాళంలో కూడా ‘ఒర్మాయుందో ఈ ముఖం’ అనే సినిమా 50 ఫస్ట్ డేట్స్ ప్రేరణతోనే రూపొందింది.
⇔ ఆ మధ్య వచ్చిన ‘వెల్కమ్ ఒబామా’ సినిమాలో భువన చంద్ర, బలభద్రపాత్రుని రమణి ట్రాక్‌లో కూడా పేరడీగా 50 ఫస్ట్ డేట్స్ ఛాయలు కనబడతాయి.
ప్రేమని చెరిగిపోయే హరివిల్లుతో పోల్చారు ప్రముఖ కవి ఆలూరి బైరాగి. ప్రేమ ఎంతో కాలం ఉండదు. దాని తీవ్రత, గాఢత చాలా సందర్భాల్లో తగ్గిపోతుంటుంది. ముఖ్యంగా ప్రేమించి, పెళ్లి చేసుకున్నవాళ్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ప్రతిరోజూ కొత్తగా ప్రేమించడం, ప్రేమని వ్యక్తం చేయడమంటే ఎంతో బాగుంటుంది కదా - అదే ‘50 ఫస్ట్ డేట్స్’ కథ.
హవాయి ద్వీపాలు ప్రకృతి అందాలకే కాదు, టూరిస్టులకీ ప్రసిద్ధి. హెన్రీ రూత్ అనే గైడ్ ఓహో ఐలాండ్‌కి వచ్చే లేడీ టూరిస్టులని తన మాటలతో పడేసి సరదాలు తీర్చుకుంటుంటాడు. సీరియస్ రిలేషన్షిప్ మీద అతనికే మాత్రం నమ్మకం లేదు.ఒకసారి హెన్రీ బోటు ఫెయిల్ కావడంతో కోస్ట్‌గార్డ్ కోసం ఎదురుచూస్తూ ఓ కేఫ్‌లో కూర్చుంటాడు. ఆ కేఫ్‌కి లూసీ విట్మూర్ అనే అమ్మాయి వస్తుంది. హెన్రీ.. లూసీతో పరిచయం పెంచుకుంటాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. ఆ మరుసటి రోజు కలుద్దామంటుంది లూసీ. ఆ అమ్మాయి మీద ఆసక్తితో ఆ మరుసటి రోజు కేఫ్‌కి వెళ్తాడు హెన్రీ. తీరా లూసీ అతడినే మాత్రం గుర్తుపట్టదు. హెన్రీ షాకవుతాడు.
రెస్టారెంట్ ఓనర్ అసలు కథ చెబుతాడు. అంతకుముందు సంవత్సరం అక్టోబర్ 13న లూసీ తన తండ్రితో పాటు బయటికి వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్‌కి గురవుతుంది. ఆమ్నీషియా వ్యాధికి గురవుతుంది. అయితే ఇందులో విచిత్రం ఏమిటంటే ప్రతిరోజూ ఆ అక్టోబర్ 13 అనుకుంటూ ఉంటుంది లూసీ. ఇంట్లోవాళ్లందరూ అక్టోబర్ 13 కిందే సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ రోజు పేపర్ తీసుకొస్తారు. లూసీ తండ్రి మార్లిన్ బర్త్‌డేగా సెలబ్రేట్ చేస్తారు. టీవీలో అదే వైకింగ్స్ ఆట చూస్తుంటారు.
లూసీ గతం తెలుసుకున్నా హెన్రీ ఆమెను వదల్లేకపోతాడు. ఆమెతో పరిచయం మరింత పెంచుకుంటాడు. లూసీ తండ్రి, సోదరుడు హెన్రీని దూరంగా ఉండమని హెచ్చరిస్తారు. ఒక దశలో ఓ పోలీసాఫీసర్ ద్వారా లూసీకి నిజం తెలుస్తుంది. కలత చెందుతుంది. మరోవైపు హెన్రీ ఆమె దినచర్యని షూట్ చేసి, ఆ వీడియో ఆమెకి చూపిస్తుంటాడు. క్రమేపీ లూసీకి తనకి యాక్సిడెంట్ అయిందని, మతిమరుపు వచ్చిందని గ్రహిస్తుంది. హెన్రీ తనతో ఉండటం కోసం, తనని ప్రేమించడం కోసం తన జీవితాశయాన్ని పక్కన పెట్టాడని లూసీకి తెలుస్తుంది. అతనితో విడిపోతుంది.
హెన్రీ సెయిలింగ్ ట్రిప్‌కి వెళ్తుండగా, లూసీ పాడిన ఓ పాట సీడీ తెచ్చి ఇస్తాడు ఆమె తండ్రి మార్లిన్. హెన్రీని కలిశాకే తొలిసారి ఆ పాట పాడినట్లు చెబుతాడు ఆమె తండ్రి. లూసీ ప్రస్తుతం బ్రెయిన్ ఇన్స్టిట్యూట్లో ఉందని తెలుసుకుని హెన్రీ అక్కడికి వెళ్తాడు. తను గుర్తున్నానా అనడుగుతాడు. హెన్రీ తెలియదని, ప్రతిరోజూ అతను కలలోకి వస్తున్నాడని లూసీ చెబుతుంది. కొంతకాలం తర్వాత లూసీ నిద్ర లేచేటప్పటికి ఓ వీడియో టేప్ ఎదురుగా ఉంటుంది. అందులో ఆమె యాక్సిడెంట్‌తో పాటు లూసీ, హెన్రీల పెళ్లి వీడియో కూడా ఉంటుంది. - తోట ప్రసాద్